కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్?
- నేడో రేపో కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ప్రకటన
- జాతీయ రాజకీయాల్లోకి రావాలని సిద్ధరామయ్యకు ప్రతిపాదన
- నేడు ప్రెస్‌మీట్.. రేపు సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం
- ఢిల్లీ వేదికగా సీఎం, డిప్యూటీ సీఎంతో ౭ గంటల పాటు భేటీ
బెంగళూరు, మే ౨౬: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసు కుంటాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామ య్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించి, పెద్ద ఓబీసీ నేతగా ఎదిగేందుకు అవ కాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవికి కట్టబెట్టబోతున్నదని కూడా తెలుస్తున్నది.
దీనిలో భాగంగానే సిద్ధరామయ్య బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటిస్తారని, మర్నాడు సీఎం పదవి కూడా రాజీనామా చేస్తారని ప్రచారం జరుగు తున్నది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాల యం వేదికగా మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుమారు ఏడు గంటలపాటు భేటీ అయి ఈ మేరకు ప్రతిపాదన తీసుకువచ్చినట్లు సమాచారం.
బయటకు మాత్రం రాజ్య సభ ఎన్నికలకు సన్నాహాలు, ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కోసమే సమావేశం జరిగిందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెబుతున్నప్పటికీ, అంతర్గతంగా మాత్రం కర్ణాటకలో సీఎం మార్పుపైనే ప్రధానంగా చర్చ సాగినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి తిరిగి బెంగళూరు చేరుకున్న సిద్ధరామయ్య వెంటనే ఆప్తులైన మంత్రులు, అనుచరులతో అత్యవస భేటీ నిర్వహించడం గమనార్హం. 2023లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత, సిద్ధరామయ్యకు రెండున్నరేళ్లు, డీకే శివకుమార్‌కు రెండున్నరేళ్ల చొప్పున సీఎం పదవి కట్టబెట్టాలని అధిష్ఠానం నిర్ణయించిన సంగతి విదితమే.
అయితే.. సిద్ధరామయ్య గడువు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో సీ ఎం పదవిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం అత్యంత చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కుల గణన, సామాజిక న్యాయం అనే నినాదాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో దేశంలోనే బలమైన ఓబీసీ నేతగా గుర్తింపు ఉన్న సిద్ధరామయ్య సేవలను జాతీయ స్థాయిలో వినియోగిం చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. వచ్చే నెల 8వ తేదీతో రాజ్యసభ నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో ఈ లోపే కర్ణాటకలో సీఎం మార్పు ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం భావిస్తున్నది.






