16 July, 2026 | 6:43 PM

నాన్నా ఒక్కసారి వచ్చిపో!

18-06-2024 04:40 AM

మరణించిన కల్నల్‌కు కుమారుడి సందేశాలు

అనంత్‌నాగ్, జూన్ 17: ఆ తండ్రి ఓ వీర సైనికుడు. దేశ రక్షణ కోసం ముష్కరుల తుపాకీ గుండ్లకు ఎదురెళ్లి వీరమరణం పొందాడు. ఆ ఘటన జరిగి దాదాపు 10 నెలల గడిచిపోయింది. కానీ, ఆ వీరయోధుడి చిన్నారి కుమారుడు మాత్రం తన తండ్రి ఇంకా తిరిగి వస్తాడనే నమ్ముతున్నాడు. రోజూ తన తండ్రికి వాయిస్ మెసేజ్‌లు పంపుతా ఒక్కసారి వచ్చిపో నాన్నా.. అని గారాబంగా పిలుస్తూనే ఉన్నాడు.. మనసు ద్రవించే ఈ పరిస్థితి గత ఏడాది సెప్టెంబర్‌లో వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ కుటుంబానిది. జమ్ముకశ్మీర్‌లోని గదూల్ గ్రామంలో గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కల్నల్ మన్‌ప్రీత్‌తోపాటు మేజర్ ఆశిష్ ధన్‌చక్, జమ్ము కశ్మీర్ పోలీస్ డిఫ్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ భట్, సిపాయి పర్దీప్‌సింగ్ అసువులు బాశారు.

దేశం మొత్తం వారి మరణానికి దుఃఖించింది. వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇప్పటికీ వాళ్లు తేరుకోలేదు. కానీ, మన్‌ప్రీత్ ఏడేండ్ల కుమారుడు కబీర్‌కు ఇవేవీ తెలియవు. తన తండ్రి ఇంకా విధుల్లోనే ఉన్నాడని, తిరిగి వస్తాడని నమ్ముతున్నాడు. దీంతో రోజూ ఫోన్‌లో తన తండ్రికి వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నాడు. ‘పాపా.. ఒక్కసారి ఇంటికి రా.. తర్వాత డ్యూటీకి వెళ్లిపో’ అని తండ్రిని పిలుస్తున్నాడని మన్‌ప్రీత్‌సింగ్ భార్య జగ్‌మీత్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. పది నెలలుగా కబీర్ రోజూ తన తండ్రికి సందేశాలు పంపుతూనే ఉన్నాడని తెలిపారు. ‘నా భర్త మేం నివసించే ఇంట్లో రెండు చినార్ మొక్కలు నాటారు. వాటికి మా పిల్లలే పేర్లే కబీర్, వాణి అని పేరు పెట్టారు. పదేండ్ల తర్వాత మళ్లీ మనం వీటిని చూసేందుకు ఇక్కడికి వస్తాం అని తెలిపారు. కానీ, ఇప్పుడు..’అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.