రాజ్‌భవన్‌ను విడిచి వెళ్లండి!
- భద్రతా సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
కోల్‌కతా, జూన్ 17: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని రాజ్‌భవన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాలని గవర్నర్ సీవీ ఆనందబోస్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై నివేదించేందుకు ప్రతిపక్ష నాయకుడు, బీజేపీనేత సువేందు అధికారి అపాయింట్‌మెంట్ తీసుకుని సోమవారం పలువురు బాధితులతో కలిసి సోమవారం రాజ్‌భవన్‌కు వచ్చారు. అక్కడ వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్‌భవన్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గవర్నర్‌ను కలిసేందుకు వీలుపడదని సెక్యూరిటీ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో సువేందు అధికారి, బాధితులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తీవ్రంగా స్పందించారు. రాజ్‌భవన్‌లోని ఉత్తర ద్వారాన్ని జన్ మంచ్ (ప్రజావేదిక) మార్చేందుకు యోచిస్తున్న తరుణంలో భద్రతా సిబ్బంది ఇలా స్పందించడం గవర్నర్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది.






