6 July, 2026 | 2:22 AM

మళ్లీ మెరిసిన దండి జ్యోతిక

21-05-2024 12:36 AM

ఆసియా రిలేలో భారత్‌కు పసిడి పతకం

బ్యాంకాక్: ఆసియా రిలే చాంపియన్‌షిప్‌లో తెలుగు అథ్లెట్ దండి జోత్యిక శ్రీ బృందం సత్తా చాటింది. 400 మీటర్ల రిలే మిక్స్‌డ్ విభాగంలో భారత జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన 4x400 మీటర్ల రిలేలో ముహమ్మద్ అజ్మల్, జ్యోతిక, అమోజ్ జాకబ్, సుభా వెంకటేషన్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో హీట్ పూర్తి చేసి పసిడి సొంతం చేసుకుంది. గతేడాది ఆసియా గేమ్స్‌లో నమోదైన టైమింగ్‌ను (3 నిమిషాల 14.34 సెకన్లు) తాజాగా బద్దలుకొట్టింది. ఇక శ్రీలంక (3:17.00 సెకన్లు), వియత్నాం (3:18.45 సెకన్లు) బృందాలు రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి.

అయితే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో భారత మిక్స్‌డ్ రిలే బృందం విఫలమైంది. ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ 400మీటర్ల రిలేలో 16 జట్లకు మాత్రమే పాల్గొనే అవకాశముంటుంది. తాజాగా స్వర్ణం సాధించినప్పటికి భారత్ 21వ స్థానంలో ఉంది. దీంతో విశ్వక్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయినట్లే. ఇప్పటివరకు 14 జట్లు మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో పాల్గొనేందుకు నేరుగా అర్హత సాధించాయి. మిగతా రెండు స్థానాల కోసం జూన్ 30లోగా బెస్ట్ టైమింగ్ నమోదు చేసిన జట్లను ఎంపిక చేయనున్నారు. చెక్ రిపబ్లిక్ (3:11.98 సెకన్లు), ఇటలీ (3:13.56 సెకన్లు) రేసులో ముందు వరుసలో ఉన్నాయి. ఇక పురుషుల, మహిళల విభాగంలో 400 మీటర్ల రిలేలో మన జట్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.