జైల్లో దర్శన్ జల్సా
బెంగళూరు, ఆగస్టు 25: ప్రియురాలిని విమర్శించాడని తన అభిమానినే హత్య చేయించి జైలుకు వెళ్లిన ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లోనూ రాచమర్యాదలు జరుగుతున్నాయి. జైల్లో ఆయన తన మిత్రులతో కలిసి మందు, సిగరెట్లు తాగుతూ కబుర్లు చెప్తున్న ఫొటో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. దర్శన్ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. అక్కడ ఆయనకు వీఐపీ సౌకర్యాలు కల్పించినట్టు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ముగ్గురు మిత్రులతో కలిసి కుర్చీల్లో కూర్చొని ఒక చేతిలో మద్యం కప్పు, మరో చేతిలో సిగరెట్‌తో ఆయన చిద్విలాసంగా కబుర్లు చెప్తున్నారు. ఆయతోపాటు కూర్చున్న ముగ్గురు రౌడీ షీటర్లని తెలిసింది. ఈ ఫొటో ఎప్పడు తీశారన్నది తెలియకపోయినప్పటికీ ఇప్పుడు పోలీస్ విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. దర్శన్ జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరు కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించింది.






