19 April, 2026 | 3:54 AM

సందీప్ ఘోష్‌పై సీబీఐ పంజా

26-08-2024 04:50 AM
  1. ఆయన ఇల్లు సహా 15 చోట్ల సోదాలు 
  2. అక్రమాస్తులను గుర్తించేందుకు యత్నం 
  3. అడ్డుకొనేందుకు తలుపులేసుకొన్న ఘోష్

కోల్‌కతా, ఆగస్టు 25: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్‌పై సీబీఐ ముప్పేట దాడి చేస్తున్నది. శనివారం ఆయనకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. ఆదివారం తెలవారుతూనే ఆయన ఇంటి తలుపు తట్టింది. ఘోష్ నివాసం సహా 15 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఘోష్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావటంతో కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఆయన అక్రమాస్తులను గుర్తించేందుకు ఆదివారం ఉదయం 6.45 గంటలకు సీబీఐ అధికారుల బృందం ఘోష్ ఇంటికి చేరుకొన్నది.

అయితే, ఆయన ఎంతకూ తలుపు తీయలేదు. చివరకు ఉదయం 8 గంటలకు తలుపు తీయటంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో కోల్‌కతా సమీపంలోని బెలెఘాతాలోని దేబాషిష్ సోమ్ అనే వ్యక్తి ఇంట్లోనూ సోదాలు చేశారు. అతను రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగంలో పనిచేస్తున్నాడు. హౌరా జిల్లాలోని హత్‌గచ్ఛ ప్రాంతంలో ఉన్న కాలేజీ మాజీ సూపరింటెండెంట్ సంజయ్ వశిష్ట్, వైద్య పరికరాల సరఫరాదారు బిపాల్ సింగ్ ఇండ్లలోనూ సోదాలు నిర్వహించారు. 

అక్తర్ అలీ దెబ్బ..

ఆర్జీ కర్ దవాఖానలో మెడికో హత్యతో సందీప్ ఘోష్ అక్రమాలు ప్రపంచానికి తెలిశాయి కానీ.. రెండేండ్ల నుంచే ఆ కాలేజీలో డిఫ్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన అక్తర్ అలీ దీనిపై పోరాడుతున్నారు. 2022లోనే ఆయన ఘోష్ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయననే వేరే కళాశాలకు బదిలీ చేశారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయటంతో ఘోష్ అక్రమాల పుట్టను సీబీఐ తవ్వుతున్నది. అక్తర్ అలీ వాగ్మూలం కూడా తీసుకొంటామని సీబీఐ అధికారులు తెలిపారు.

తాజా సోదాలపై ఆయన స్పందించారు. ‘సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్‌గా రాకముందు తూర్పు ఇండియాలోనే కర్ కాలేజీ నంబర్ వన్‌గా ఉంది. ఇది వందేండ్లకు పైబడిన కాలేజీ. కాలేజీలో జరిగిన అనేక కుంభకోణాలను నేను బయటపెట్టాను. అందులో మొదటిది విద్యార్థులను ఉద్దేశపూర్వకంగానే ఫెయిల్ చేయటం. వారి నుంచి కొందరు అధికారులు ఫీజుల రూపంలో దోచుకొన్నారు. విద్యార్థుల నుంచి మరికొంతమంది విద్యార్థులే ఈ డబ్బు వసూలు చేసేవారు. ఘోష్‌ను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని ప్రయత్నించినప్పుడు జూనియర్ విద్యార్థులకు మందు తాపించి ధర్నాలు చేయించారు. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని అన్నారు.