31 May, 2026 | 4:10 PM

నకిలీ జీవో కోసం రాధాకృష్ణకు రూ.4 కోట్లు

31-05-2026 03:26 PM

హైదరాబాద్: వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా స్కెచ్ పై  శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. భూమి క్రమబద్ధీకరించాలని కలెక్టర్, సీసీఎల్ఏకు, ఆయా కార్యాలయాలకు దస్త్రాలు వెళ్లినట్లు, ఐఏఎస్ అధికారుల సంతకాల ఫోర్జరీ చేసి ఆర్డర్లు సృష్టించారని డీసీపీ వెల్లడించారు. మొదటి నుంచి జరిగిన ప్రక్రియకు సంబంధించిన ఆర్డర్లు సీజ్ చేశామని, ఫేక్ ఆర్డర్లు తయారీలో రాధాకృష్ణ లాయర్ తో పాటు మరో ఇద్దరు సహకరించినట్లు తేలిందన్నారు. రాధాకృష్ణ చెప్పిన విషయాలు, నిమ్మల కుటుంబం చెప్పిన విషయాలు సరిపోయాయని, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, రమేశ్ పాత్రపై ఆధారాలు దొరికాయని డీసీపీ పేర్కొన్నారు.

 రామకృష్ణ, బృందం భూమికి సంబంధించిన ఆర్డర్లు తయారు చేసిందని, నకిలీ జీవో కోసం రాధాకృష్ణకు రూ.4 కోట్లను బ్రహ్మనాయుడు ఇచ్చారని తెలిపారు. రాధాకృష్ణ లాయర్ బృందానికి మరో రూ.4 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోందన్నారు. నగదు రూపంలో లావాదేవీ జరిగినందున ఎక్కడికి వెళ్లాయో ట్రాక్ చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు. కేసు నమోదు కాగానే పత్రాలు దాచిపెట్టాలని డ్రైవర్ ప్రవీణ్ కు రాధాకృష్ణ చెప్పాడని, పత్రాలు తరలించే క్రమంలో అతడిని పట్టుకొని అరెస్టు చేశామన్నారు.

ఫోర్జరీ సంతకాలతో సీసీఎల్ఏ, హైడ్రా ఆఫీసులు క్లీయరెన్స్ ఇచ్చినట్లు సృష్టించారని, రాధాకృష్ణ 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఆయన వెల్లడించారు. రాధాకృష్ణకు సంబంధించి కందుకూరు, అంబర్ పేటలో స్థల పత్రాలు లభించాయని, వివిధ నకిలీ సంస్థలు సృష్టించి స్టాంపులు తయారు చేశారు. 10 ఏటీఎం కార్డులు, 12 చెక్ బుక్ లు, 3 ల్యాప్ టాప్ లు, 2 ఫోన్లు సీజ్ చేసీ ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని, మరో ఐదుగురిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.