calender_icon.png 6 February, 2026 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీ నియామకానికి డెడ్‌లైన్

06-02-2026 12:41:44 AM

  1. శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ
  2.   4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 
  3. గతేడాది ఏప్రిల్ ప్రతిపాదనల ఆధారంగానే ఎంపిక జరగాలి
  4. జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణ డీజీపీ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర పోలీస్ బాస్ నియామకాన్ని తక్షణమే కొలిక్కి తేవాలని స్పష్టం చేసింది. ప్రస్తుత డీజీపీ బి.శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. కేవలం 4 వారాల్లోగా డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను,తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేపట్టా లని సూచించింది.శివధర్ రెడ్డి నియామకం విషయంలో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిం ది. అయితే, విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం హైకోర్టు విచారణ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిం ది. ఇంత టి ప్రాముఖ్యత కలిగిన అంశాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ముందు ఎందుకు లిస్ట్ చేశారు సాధారణంగా డీజీపీ నియామకం వంటి కీలక అంశాలను సీనియర్ జడ్జిల ధర్మాసనం విచారించాలని మేము ఆశి స్తాం.

అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశా ల్లో ఎలాంటి తప్పు లేనందున జోక్యం చేసుకోవడం లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. గతేడాది సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి బి.శివధర్ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. అయితే, ఈ నియామకం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్ రావు హైకోర్టు ను ఆశ్రయించారు.

ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీర్పు ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని, యూపీఎస్సీ ఎంపిక చేసిన ప్యానెల్ నుంచే నియమించాలని వాదించారు.నాడు విచారణ జరిపిన హైకోర్టు.. శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించినప్పటికీ, డీజీ పీ ఎంపిక ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై స్పష్టత కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం 4 వారాల గడువు విధించింది.

ఇక బంతి యూపీఎస్సీ కోర్టులో..

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో డీజీపీ ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితా నుంచి యూపీఎస్సీ ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ప్యానెల్ నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంది.