తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే దక్కన్ సర్కార్
కళా శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తానే నిర్మిస్తున్న చిత్రం ‘దక్కన్ సర్కార్’. కళా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాణక్య, కియారెడ్డి, మౌనిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ పోస్టర్, టీజర్ లాంచ్ కార్యక్రమం తెలుగు ఫిలిం ఛాంబర్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా గాదె ఇన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళా శ్రీనివాస్ ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ సినిమా తీశాడు.
ఉద్యమం తీరుతెన్నులను, ఉద్యమంలోని కష్టాలను చూపిస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి’ అన్నారు. రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాలను ఆహ్వానించాలి. ఒక సినిమాతో ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. అందుకే ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నా’ అని చెప్పారు. హీరో చాణక్య మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ తన ప్రతిభతో 12 ఏళ్ల ఉద్యమాన్ని 2 గంటల్లో చూపించారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించబోతున్న సినిమా ఇది’ అని చెప్పారు. డైరెక్టర్ కళా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు.
తెలంగాణ సినిమాలు ఇంకా ఎన్నో రావాల్సి ఉంది. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో ఈ సినిమా చేశా. ఆడియో లాంచ్ వేడుక త్వరలో నిజామాబాద్‌లో నిర్వహిస్తాం’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఘర్షణ శ్రీనివాస్, నటి హేమతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొంది.






