29 August, 2026 | 9:34 PM

ఉద్యమాలతోనే నిర్ణయాధికారం

29-08-2026 02:22 AM

తెలంగాణ రాష్ట్ర సాధన ఒక బలమైన రాజకీయ పోరాటానికి ల భించిన చారిత్రక ఫలితం. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే మూడు పదాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఒకే రాజకీయ డిమాండ్‌గా మలిచాయి. ప్రాంతీయ అసమానత, వనరుల పంపిణీ, ఉపాధి, స్వీయ గౌరవం వంటి అనేక ప్రశ్నలను ఈ నినాదం తనలో ఇముడ్చుకుంది. భిన్నమైన కులాలు, వర్గాలు, ప్రాంతాలు, సా మాజిక వర్గాలు తమ తమ సమస్యలతో ఉద్యమంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణ అనే ఉమ్మడి లక్ష్యం వాటిని ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురాగలిగింది.

ఇది సాధారణ రాజకీయ సమీకరణ కాదు, ఒక ఆకాంక్షను దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా మార్చిన ప్రక్రియ. అయితే రాష్ట్ర సాధనతో కథ ముగియలేదు. అసలు ప్రశ్న అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? రాష్ట్ర వనరులపై నిర్ణయాధికారం ఎవరికి పెరిగింది? విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, భూమి, వ్యాపారం, పరిపాలన, మీడియా వంటి రంగాల్లో సామాజిక వర్గాల మధ్య ఉన్న అసమానత ఎంతవరకు మారింది? ఒక ప్రాంతానికి రాష్ట్రం లభించడం ఒక రాజకీయ విజయం కావచ్చు, కానీ ఆ రాష్ట్రం లో సామాజిక న్యాయం స్థిరపడటం మరో పెద్ద రాజకీయ ప్రక్రియ.

ఇక్కడే బీసీల ప్రశ్న ముందుకువస్తుంది. తెలంగాణ ఉద్యమం ఒక ప్రాంతీయ ఆకాంక్షకు రాజకీయ చట్టబద్ధతను సంపాదించింది. కానీ, బీసీ సమాజం ఎదుర్కొం టున్న సమస్యలకు అదే స్థాయి రాజకీయ చట్టబద్ధత ఇంకా సంపూర్ణంగా ఏర్పడలేదు. రాజకీయ చట్టబద్ధత అంటే కేవలం చట్టపరమైన గుర్తింపు కాదు. ఒక సామాజిక వర్గం తన సమస్యలను సమాజం ముందుంచి, వాటిని ప్రజా డిమాండ్లుగా మలిచి, ఆ డిమాండ్లను రాజకీయ వ్యవస్థ అంగీకరించే స్థాయికి తీసుకెళ్లగల సామ ర్థ్యం, సంస్థాగత బలం కలగడం.

ఇదే విషయంలో బీసీ రాజకీయాల ప్ర ధాన సమస్య దాగి ఉంది. ఈ దేశంలో ఆధిపత్య సామాజిక వర్గాలకు రాజకీయ నాయకత్వం కొత్త విషయం కాదు. భూమి, విద్య, ఆర్థిక వనరులు, పరిపాలనా అనుభవం, సామాజిక సంబంధాలు, మీడియా ప్రాప్తి, రాజకీయ పార్టీల్లో స్థానం వంటి అనేక వనరులు తరతరాలుగా కొందరు వ ర్గాలకు ఎక్కువగా అందుబాటులో ఉండ టం వల్ల వారికి రాజకీయ నాయకత్వానికి అవసరమైన సామాజిక మూలధనం ఏర్పడింది. అందువల్ల ఒక వ్యక్తి రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు అతని వెనుక కేవలం వ్యక్తిగత ప్రతిభ ఉండదు, తరతరాలుగా నిర్మితమైన సామాజిక వనరుల ప్ర భావం కూడా ఉంటుంది.

బీసీల పరిస్థితి భిన్నం. జనాభాలో పెద్ద భాగం ఉన్నప్పటికీ, బీసీలలోని అనేక కు లాలు చారిత్రకంగా వృత్తి, విద్య, భూమి, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో వెనుకబడి ఉన్నాయి. ఫలితంగా బీసీ నాయకత్వం వ్యక్తిగత ప్రతిభతో ఎదిగినా, దాన్ని విస్తృతమైన సామాజిక శక్తిగా మార్చడానికి అవసరమైన సంస్థాగత బలం తరచూ ఏర్పడలేదు. ఒక నాయ కుడు ఎదగడం, ఒక సమాజం రాజకీయం గా ఎదగడం రెండూ ఒకటి కావు. ఇదే తేడాను బీసీ రాజకీయాలు ఇప్పటికీ పూర్తి గా అధిగమించాల్సి ఉంది.

అయితే బీసీల కోసం ప్రయత్నాలు జరగలేదని చెప్పడం చరిత్రకు అన్యాయం. వివిధ కాలాల్లో మహాజన ఫ్రంట్, దళిత బహుజన మహాసభ, మహాజన పార్టీ, బ హుజన వామపక్ష ప్రయత్నాలు, అనేక బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, రాజకీయ వేదికలు బీసీల రాజకీయ, సామా జిక సమస్యలను ముందుకు తెచ్చాయి. ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఒక్క మాటతో కొట్టిపారేయడం సరైంది కాదు. అవి బీసీ ప్రశ్నను ప్రజా చర్చలోకి తీసుకురావడంలో, స్వీయ గౌరవాన్ని పెంచడం లో, రాజకీయ చైతన్యాన్ని విస్తరించడంలో తమ వంతు పాత్ర పోషించాయి.

అయితే ఆ ప్రయత్నాలు తెలంగాణ ఉద్యమం సాధించినంత విస్తృతమైన, దీర్ఘకాలికమైన, సర్వామోదిత రాజకీయ ఆకాంక్షగా ఎందుకు మారలేకపోయాయి? అన్న ప్రశ్నకు కేవలం ‘బీసీలు అనైక్యంగా ఉన్నారు’ అనే సమాధానం సరిపోదు. బీసీలు ఒకే కులం కాదు, అనేక వృత్తులు, ప్రాంతాలు, ఆర్థిక స్థాయి లు, సామాజిక అనుభవాలు కలిగిన విస్తృ త సమూహం. ఈ వైవిధ్యం సహజమే.

తెలంగాణ ఉద్యమంలో కూడా కులా లు, వర్గాలు, ప్రాంతాలు వేర్వేరు ప్రయోజనాలతోనే వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఒక రాజకీయ లక్ష్యం చుట్టూ క్రమంగా సమీకరించే ప్రక్రియ సాగింది. బీసీ ఉద్యమానికి కూడా ఇదే పాఠం అవసరం. ప్రతి కులం తన సమస్యను మాత్రమే ముందు కు తెచ్చుకుంటే అది కుల సంఘంగా మి గులుతుంది. ఆ సమస్యలన్నింటి వెనుక ఉన్న ఉమ్మడి నిర్మాణాత్మక కారణాలను గుర్తించి, వాటిని ఒక రాజకీయ కార్యక్రమంగా మలిస్తేనే అది బీసీ ఉద్యమంగా ఎదుగుతుంది.

ఇక్కడే మరో అంతర్గత వైరుధ్యం కనిపిస్తుంది. ఒక బీసీ నాయకుడు రాజకీయంగా ఎదిగినప్పుడు, మిగతా బీసీ నాయకులు అతన్ని ఉమ్మడి ప్రయాణంలో భాగ స్వామిగా చూడకుండా ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు కనిపిస్తాయి. అందువల్ల బీసీలకు కావాల్సింది కేవలం ‘ఐక్యత’ అనే నినాదం కాదు, ఉమ్మడి ప్రయోజనాలపై నిర్మితమైన రాజకీయ ఐక్యత. ఏ ఒక్క నాయకుడి చుట్టూ ఏర్పడే ఐక్యత వ్యక్తి మారితే విచ్ఛిన్నమవుతుంది. ఒక కులం చుట్టూ ఏర్పడే ఐక్యత మిగతా కులాలకు అనుమానాన్ని కలిగిస్తుంది. కానీ ఉమ్మడి హక్కులు, డిమాండ్లు, రాజకీయ కార్యక్రమం చుట్టూ ఏర్పడే ఐక్యత వ్యక్తులకంటే పెద్దది. అదే నిలబడుతుంది.

అందుకే బీసీ ఉద్యమం తన ఉమ్మడి రాజకీయ కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రకటించుకోవాలి. జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలు, కులగణన ఆధారంగా విధాన నిర్ణయాలు, విద్యా అవకాశాల విస్తరణ, ఉద్యోగాల్లో సమాన ప్రాతినిధ్యం, బీసీ వృత్తులకు ఆర్థిక పునరుద్ధరణ, భూమి, రుణం, మార్కెట్ అవకాశాలకు ప్రాప్యత, ప్రభుత్వ కొనుగోళ్లలో భాగస్వామ్యం, మహిళలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు ఒక సమగ్ర బీసీ రాజకీయ కార్యక్రమంలో భాగం కావాలి.

ఇది కేవలం రిజర్వేషన్ల ప్రశ్నతో ముగిసే ఉద్యమం కాకూడదు. బీసీ సమస్య అనేది ప్రతినిధిత్వ సమస్య మాత్రమే కాదు, ఉత్పత్తి వనరులపై ప్రాప్యత, విద్య, ఉపాధి, మార్కెట్, సామాజిక గౌరవం, సాంస్కృతిక గుర్తింపు, నిర్ణయాధికారం వంటి అనేక రంగాలతో ముడిపడి ఉన్న ప్రశ్న. అందువల్ల బీసీ ఉద్యమం కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, భావజాల రంగాల్లో ఒకేసారి పని చేయాలి.

తెలంగాణ ఉద్యమం నుంచి బీసీలు నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విష యం దీర్ఘకాలికత. తెలంగాణ ఆకాంక్ష ఒక్క రోజులో పుట్టలేదు. 1969 ఉద్యమం నుం చి 2014 రాష్ట్ర సాధన వరకు అనేక దశల్లో పోరాటం కొనసాగింది. ఉద్యమం రూపా లు మారాయి, నాయకత్వాలు మారాయి, రాజకీయ పరిస్థితులు మారాయి, కానీ ఆకాంక్ష కొనసాగింది. అదే నిరంతరత చివరకు రాజకీయ ఫలితాన్ని సాధించింది.

అయితే చివరికి బీసీల లక్ష్యం కేవలం ఎక్కువ సీట్లు గెలవడం కాదు. నిర్ణయాధికారంలో తమ జనాభా, సామాజిక స్థితి, చారిత్రక పాత్రకు తగిన స్థానం సంపాదించుకోవడం. ప్రాతినిధ్యం, రిజర్వేషన్, కుల గణన, సంస్థాగత నిర్మాణం.. ఇవన్నీ అం దుకు సాధనాలు. వీటన్నింటినీ కలిపి రాజకీయ శక్తిగా మలచడమే అసలు లక్ష్యం. బీసీలు తమ ఐక్యతను నినాదంగా కాకుం డా ఆచరణగా, తమ నాయకత్వాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా, తమ జనాభా ను కేవలం సంఖ్యగా కాకుండా రాజకీయ శక్తిగా మార్చుకున్న రోజున తెలంగాణ ఉద్యమ మార్గం బీసీల గమ్యానికి నిజమైన మార్గంగా మారుతుంది.

జై బీసీ! జై బహుజన్!!

 వ్యాసకర్త: సత్యశోధక 

మహాసభ ప్రతినిధి

పాపని నాగరాజు