పెద్దల మాట సద్ది మూట!
‘మాతృమాన్, పితృమాన్, ఆచార్యవాన్ పురుషోవేద’ అని శతపథబ్రాహ్మణం చెబుతుంది. తల్లి, తండ్రి లేదా గురువు మాటను విన్నవాడు మనిషవుతాడని దాని అర్థం.
మన విద్యాభివృద్ధికి తోడ్పడే వారు మొదట తల్లిదండ్రులే. ఆ తర్వాత అన్నలే. అన్నలు లేకపోతే మేనమామలు శ్రద్ధ తీసుకోవాలి. బాబాయిలు కూడా సహకరించవచ్చు. ఎవరి సాయం లేకపోతే ప్రాథమికంగా ఎవరికైనా విద్య లభించడం కష్టమే.
మా ఇంట్లో నా విద్య పట్ల అత్యంత శ్రద్ధ చూపిన వారు మా పెద్దన్న వీరయ్య గారు. నేను విద్యావంతుడినైతే, ఆయన పిల్లలు కూడా చదువులో ముందుకేగుతారని ఆయన తలంపు. నన్నాదర్శంగా తీసు కొని మా అన్న కుమారుడు రామనాథం హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి, ఉపాధ్యా య శిక్షణ పొంది ఉపాధ్యాయుడయ్యాడు. ప్రతి విషయంలో నా సలహా పాటిస్తూ, తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ విద్యాభివృద్ధి సాధించాడు.
అధ్యాపకుడిగా నియమితుడైన సందర్భంలో నేను రామనాథం వెంట మొదటి సారి మహబూబ్ నగర్ వెళ్లాను. ఇంటర్వ్యూలో ఎం.ఎల్.ఏ జయపాల్ రెడ్డి గారున్నారు. నేనప్పటికే హైదరాబాద్‌లోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నాను. రామనాథం వెంట ఉన్న నన్ను చూసి జయపాల్‌రెడ్డి గారు ‘మీ వా డికి ఎక్కడ పోస్టు ఇవ్వమంటావు?’ అని నన్నడిగారు. ‘మా ఊరు కొల్కులపల్లికైనా లేదా మీ ఊరు మాడ్గులకైనా ఇవ్వండి’ అని కోరాను. వారు ‘మా ఊరికే ఇస్తాను’ అని నియామక పత్రం ఇప్పించారు.
రామనాథం హైదరాబాద్‌లో నాలాగే కష్టపడి చదువుకున్నాడు. ట్యూషన్ చెప్పి, వచ్చిన డబ్బుతో జాగ్రత్తగా కాలం గడిపాడు. నా అదృష్టం కొద్ది నాకు హైదరాబా ద్‌లో ఉద్యోగం దొరికితే, రామనాథానికి మాత్రం ఊళ్లో ఉద్యోగం దొరికింది. ప్రతి రోజు స్వగ్రామమైన కొల్కులపల్లి నుంచి మాడ్గులకు వెళ్లి చదువు చెప్పి వచ్చేవాడు.
కొడుకు ఉద్యోగస్థుడు కనుక ఒక మం చి అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుకున్నారు మా పెద్దన్నయ్య. అమ్మాయి వాళ్లు బట్టల వ్యాపారస్థులు. పెద్ద కుటుం బం వారిది. ఆమన్‌గల్లు, బ్లాకు స్థాయి గ్రా మం. మా అన్నయ్య, వదిన అమ్మాయిని సెలెక్ట్ చేశారు. కానీ, మా రామనాథం వెంటనే తన అంగీకారం చెప్పలేదు. కార ణం, నేనూ, మా ఆవిడ ప్రమీల చూసిన తర్వాతనే తన అంగీకారం చెబుతానని తెలియజేశాడు. ఇది అతనికి మా మీద ఉన్న నమ్మకం. మా పెద్దన్నయ్య చెప్పినట్లు నేను విన్నాను. అలాగే నేను చెప్పినట్లు మా రామనాథం నడుచుకోవాలని అనుకోవ డం అతని మంచితనమే అని చెప్పక తప్పదు. ‘నాకు ఎవరేమి చెప్పేది?’ అనే అహంకారం రామనాథంలో ఇసుమంత కూడా లేదు. కనుకనే నేను, మా ఆవిడ ప్రమీల అమ్మాయిని చూసి బాగుందని చెప్పిన తర్వాతనే అతడు పెళ్లికి అంగీకరించాడు. పెళ్లి ఘనంగా జరిగింది. ఇంట్లో పెద్ద మనవడి పెళ్లి కనుక ఇంటిల్లిపాది ఎంతో సంబ రపడిపోయింది.
రామనాథానికి మాడ్గుల నుంచి సొంత గ్రామమైన కొల్కులపల్లికి ఉద్యోగం మా రింది. మా అన్నయ్య బట్టల వ్యాపారి కను క, తీరిక వేళల్లో సాయపడుతూ, తమ్ముణ్ణి హైదరాబాద్‌లో చదివించాడు.
ఏ కారణమో తెలియదు కానీ రామనాథానికి, అతని తమ్మునికీ మధ్య విభేదాలు తలెత్తాయి. మా అన్నయ్య చిన్న కొడుకు వైపు నిలిచాడు. ఊళ్లో పని చేస్తున్న కొడుకును, తన ఇంట్లోంచి వెళ్లి ఎక్కడైనా ఉండ మని ఆదేశించారు. పాపం రామనాథం నన్ను హైదరాబాద్ నుంచి పిలిచి పరిష్కారం చెప్పమన్నాడు. ఆ సందర్భంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. రామనా థం నాలాగే హైదరాబాద్‌లో ఉండి పిల్లల్ని చదివిస్తే ఎంతో అభివృద్ధి కలుగుతుందని ఊహించాను. రామనాథాన్ని తండ్రి మా టను తలదాల్చి ఇంటి నుంచి బయటికి రమ్మన్నాను. అతడు నా మాటను ఆమోదించి, హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సంతోష్ నగర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని పిల్లల చదువు విషయం లో శ్రద్ధ తీసుకున్నాడు. అయితే ప్రతిరోజు తన సొంత గ్రామానికి 60 మైళ్లు ప్రయా ణం చేసి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసి వచ్చేది.
పుట్టిన గ్రామంలో ఉద్యోగం ఉన్నా, ప ట్నంలో నివాసం ఏర్పరుచుకొని ప్రతి రోజు సొంత ఊరికి వెళ్లి రావడం ఎంతో కష్టమైన పని. అయినా రామనాథం ఉద్యో గ నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించలేదు. ముగ్గురు పిల్లల్ని చదివిం చడంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు.
రామనాథానికి నేను ఆదర్శం అని ఇం తకుముందే తెలియజేశాను. నాలాగా పైచదువులు చదవాలన్న అతని కోరిక ఆహ్వా నింపదగింది. నేనొక పీజీ చేస్తే తాను రెండు పీజీలు చేశాడు. పైగా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఎం.ఎడ్ కూడా చేశాడు. కానీ, నాలాగా ఏ సబ్జెక్టులోను పిహెచ్.డి చేయలేకపోయాడు. కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో పిహెచ్.డి చేయాలని ప్రయత్నించా డు. ప్రవేశ పరీక్షకు రెండుసార్లు కూర్చున్నాడు. రెండవసారి కూర్చున్నప్పుడు అత డు విద్యా విషయక పరిశోధన చేయాలనుకుంటున్నాడని తెలిసింది.
ఒక రోజడిగాను ‘పరిశోధన అంటే ఇష్టమా?’ అని. సమాధానంగా ‘నాకు ఏ విషయంలో చేయాలో అర్థం కావడం లేదు. ఎం.ఏ తెలుగు, ఎం.ఏ రాజనీతి శాస్త్రం ఈ రెండింటిలో చేయవచ్చు. అలా గే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చేయవచ్చు’ అన్నాడు.
నేను అతని తెలివితేటలు తెలిసిన వాణ్ణి కాబట్టి తెలుగులో పరిశోధన చేయడానికి ప్రవేశ పరీక్షకు కూర్చోమన్నాను. అదృష్టవశాత్తు ప్రవేశ పరీక్షలో నెగ్గి పిహెచ్.డి ఇంట ర్వ్యూకు వచ్చాడు. అతనికి ‘భారతంలో రాజనీతి’ అనే అంశం మీద ఓ.యూ.లో ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారి పర్యవేక్షణలో పరిశోధన చేయడానికి అవకాశం లభించింది.
ఎలాగైతేనేమి రామనాథం ఇక్కడక్కడ తిరిగి మళ్లీ తెలుగుకే వచ్చాడనిపించింది. మా పెద్దన్నయ్య గారు తన బాల్యంలో భా గవతాన్ని శ్రావ్యంగా చదివి వినిపించేవారు. వాళ్ల నాన్న ప్రభావం, నా ప్రభావం అతని మీద పడినట్లుంది. అయితే, మా అన్న గారికి రామనాథం డాక్టరేట్ డిగ్రీ తీసుకున్న విషయం తెలియదు. ఎందుకంటే మా అన్న గారు అంతకుముందు సంవత్సరమే దివంగతుడయ్యారు. మా అన్న పరలోకగతులైన వారంలోనే నా శ్రీ మతి ప్రమీల కూడా అసువులు విడిచింది.
మా అన్నయ్య చనిపోయి 10 రోజులు కాలేదు. కానీ, మా ఆవిడ పోయిన విష యం తెలిసి, రామనాథం హాస్పిటల్‌లో ఉన్న మా ఆవిడ పార్థివ శరీరాన్ని చూడడానికి వచ్చాడు. ‘పది రోజులదాకా బయ టకు వెళ్లరాదని అతని బంధువులు శాసించినప్పటికీ చిన్నమ్మ మీద ఉన్న ప్రేమ అతణ్ణి ఆ విధంగా చేసింది. రామనాథానికి మొదటి నుంచి నేనన్నా, ప్రమీలన్నా ఎంతో గౌరవం. నా పిల్లలంటే కూడా ఎంతో ప్రేమ.
వ్యాసకర్త సెల్: 9885654381
ఆచార్య మసన చెన్నప్ప






