07-02-2026 03:08:31 PM
- పీఆర్టీయూ టీఎస్ స్టేట్ సెక్రటరీ అమరేంద్ర సాగర్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో కీలకమైన ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం వలన తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అందుకే ఎస్జీటీ పోస్టుల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ టీఎస్ స్టేట్ సెక్రటరీ అమరేంద్ర సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2325 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా అశాస్త్రీయమని ఆయన అన్నారు.
కొత్తగా అవసరమైన 2064 పోస్టులు సృష్టించకుండా ,ప్రాథమిక విద్యకు వెన్నుముక లాంటి ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించారు. ఇప్పటికే చాలా ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఇలాంటి పరిస్థితులలో ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఆయన చెప్పారు.
ఎస్జీటీ ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యా వ్యవస్థకి మూలస్తంభాలని, గత మూడు దశాబ్దాలుగా వారికి సరియైన ప్రమోషన్ లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలని కోరారు. విద్యారంగాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని పీఆర్టీయూ టీఎస్ స్టేట్ సెక్రటరీ అమరేంద్ర సాగర్ విజ్ఞప్తి చేశారు.