25 June, 2026 | 1:04 PM

ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం పదిలం

25-06-2026 11:40 AM

వచ్చేది మళ్లీ గులాబీ రాజ్యమే:

 మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సత్తుపల్లి, జూన్ 24(విజయ క్రాంతి):  ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు విచ్చేసిన బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు (కేటీఆర్)కి ఖమ్మం జిల్లా ప్రజల తరఫున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) నాయకత్వంలోనే తెలంగాణ సమాజానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  స్పష్టం చేశారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఆయన కష్టం వల్లే నేడు తెలంగాణ సస్యశ్యామలమైందని గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగిన అద్భుత ప్రగతి అంతా కేసీఆర్ దూరదృష్టి వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించే ఇలాంటి ఉత్తమ నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

గతంలో ప్రజలు చేసిన చిన్న పొరపాటును సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర వ్యతిరేకత మొదలైందని పువ్వాడ అజయ్ కుమార్  ధ్వజమెత్తారు. ఐదేళ్ల కాలపరిమితిలో ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. మిగిలిన కాలం కూడా త్వరలోనే ముగుస్తుంది. రాబోయే రెండేళ్లలో (2027, 2028 సంవత్సరాలు) ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కావడం ఖాయం అని ఆయన జోస్యం చెప్పారు. అప్పటివరకు ప్రజలు ఓపిక పట్టాలని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, ఖమ్మం కోటపై మళ్లీ గులాబీ జెండాను ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో పార్టీలకు అవకాశమిచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలు, ఈసారి జిల్లాకు ఎంతో చేసిన కేసీఆర్ గారికి, బీఆర్‌ఎస్ పార్టీకి మళ్లీ మద్దతుగా నిలవాలని, సత్తుపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని ఆయన కోరారు.