4 July, 2026 | 4:34 AM

భెల్ లాభంలో 25 శాతం క్షీణత

22-05-2024 01:13 AM

ఆదాయం రూ.8,417 కోట్లు

ముంబై, మే 21: ప్రభుత్వ రంగ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) కన్సాలిడేటెడ్  నికరలాభం 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 25 శాతం క్షీణించి రూ. 489.62 కోట్ల వద్ద నిలిచింది. వ్యయాలు పెరగడం లాభాల తగ్గుదలకు కారణం. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 658.02 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ముగిసిన త్రైమాసికంలో భెల్ ఆదాయం స్వల్పంగా రూ. 8,338.61 కోట్ల నుంచి రూ. 8,417 కోట్లకు చేరింది. మంగళవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షస్త్రరుకు రూ.0.25 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఏజీఎం జరిగిన తేదీ నుంచి 30 రోజులలోపు డివిడెండు చెల్లించనున్నట్టు భెల్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో భెల్ షేరు 3 శాతం పెరిగి రూ. 319.20 వద్ద ముగిసింది