మక్కల కొనుగోలు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం
మక్కల కొనుగోలు వేగవంతం చేయాలి: మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి
తాడ్వాయి, మార్చి 3 (విజయక్రాంతి): కుప్పలు పోసుకున్నాం... కనికరించండి అనే శీర్షికన విజయక్రాంతిలో సోమవారం ప్రచురితమైన వార్తకు జిల్లా మార్క్ఫెడ్ డి ఎం స్పందించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీసుకువచ్చిన మక్కలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని సిబ్బందిని ప్రశ్నించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన మక్కలను వెంట వెంటనే తూకం వేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఇన్ని రోజులు అవుతున్నా ఎన్ని మక్కలు కొనుగోలు చేశారని సిబ్బందిపై మండిపడ్డారు.ఇంత అలసత్వం ఎందుకని ప్రశ్నించారు.
రైతుల తీసుకువచ్చిన మక్కలను ఇప్పటివరకు కేవలం 30 శాతం మాత్రమే కొనుగోలు చేశారని, మిగతా 70 శాతం ఎప్పుడు కొనుగోలు చేస్తారని ఆయన సిబ్బందిపై మండిపడ్డారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడే పడిగాపులు కాయాలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేవలం 7 వేల బస్తాలు మాత్రమే కొనుగోలు చేశారని, మిగతా బస్తాలు ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోలు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నర్సింలు, నితేష్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




