రాబిన్‌హుడ్ వాయిదా
నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోందీ సినిమా. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోందీ సినిమా. ఇది నితిన్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కూడా. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. “అనుకోని కారణాల వల్ల మేము ముందుగా ప్లాన్ చేసినట్టుగా డిసెంబర్ 25న ‘రాబిన్‌హుడ్’ రిలీజ్ అవ్వడం లేదు.
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది మూవీ యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని, ఒక్క పాట షూట్ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. నిర్మాణానంతర పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మహా శివరాత్రికి లేదా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.






