మహిళలకు పట్టం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా మరో కీలక ముందడుగు పడింది. పార్లమెంట్ స్థానాలను 543 నుంచి 816కి పెంచడంతోపాటు వాటిలో నుంచి 273 సీట్లను మహిళలకు కేటాయించేందుకు వీలుగా తీసుకొచ్చిన ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ముసాయిదా బిల్లును పార్లమెంట్ లో ఆమోదించేందుకుగానూ ఏప్రిల్ 16న ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది.
ఈ సమావేశాల్లో మూడు కీలకమైన బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, రాష్ట్రాలతోపాటు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదిం పజేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు మద్ద తు తెలపాలని ప్రధాని మోదీ ప్రతిపక్షాలను కోరారు.
‘ఈ నెల 11న ఫూలే, 14న అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని దేశంలోని కోట్లాది మహిళల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా అడుగులు వేయబోతున్నాం. రాజ్యాంగ స్ఫూర్తితో మహిళలకు చట్టసభల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పిం చాం. మనమంతా ఏకమై నారీ శక్తికి పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైం ది. పార్టీలకతీతంగా అందరం ఏకతాటిపైకి వచ్చి నారీమణుల రుణం తీర్చుకోవాలి’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కాగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకొచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్ (106వ రాజ్యాంగ సవరణ బిల్లు)కు 2023 సెప్టెంబర్ 20న లోక్‌సభ, 2023 సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం విదితమే. తాజాగా ఈ రిజర్వేషన్ల అమలుకు అనువుగా పార్లమెంట్ సీట్ల సంఖ్య ను పెంచడమే కాకుండా, మహిళలకు 273 సీట్లను ప్రత్యేకంగా కేటాయించే బిల్లును తీసుకొచ్చారు. జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియలు పూర్తయ్యాక ఈ రిజర్వేషన్లు మహిళలకు దక్కే అవకాశముంది.
వాస్తవానికి చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న చారిత్రక నిర్ణయం ఈనాటిది కాదు. దీనికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. 1997లో నాటి దేవేగౌడ సర్కార్ తొలిసారి మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాల మహిళలకు ‘కోటాలో కోటా’ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ‘కౌన్ మహిళా హై? కౌన్ నహీ హై? కేవల్ బాల్ కాటీ మహిళా బర్ నహీ రహ్నేదెంగే’ (ఎవరు మహిళలు? ఎవరు కాదు? కేవలం జుట్టు కత్తిరించుకున్న మహిళలను అనుమతించేది లేదు) అని బిల్లుపై చర్చ సందర్భంగా శరద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి.
ఆ తర్వాత 2010లో యూపీ ఏ హయాంలో ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. కోటాలో కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ యాదవ్ త్రయం శరద్ యాదవ్, ములాయంసింగ్ యాదవ్, లాలూ యాదవ్ అడ్డుకోవడంతో లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోయింది. మళ్లీ 2023లో మోదీ సర్కార్ మహిళా రిజర్వేషన్లను తెరపైకి తీసుకురాగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే కోటాలో కోటా దక్కింది.
బలహీనవర్గాల మహిళల కోసం నాడు యాదవ త్రయం చేసిన పోరాటం వృథా అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలతోపాటు బలహీనవర్గాలకు ‘కోటాలో కోటా’ కేటాయిస్తేనే రిజర్వేషన్ల ఫలాలు మహిళలకు పరిపూర్ణంగా దక్కుతాయని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు.




