10 April, 2026 | 1:55 AM

జీవిత ఖైదీలను విడుదల చేయండి

10-04-2026 12:00 AM

తెలంగాణ జైళ్లలో ఎంతో కాలంగా ఉంటున్న జీవిత ఖైదీల విడుదల విషయంలో మానవ హక్కుల వేదిక చాలాకాలంగా పోరాడుతున్నది. అర్హులైన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర అధికారులకు గత కొంతకాలంగా విన్నవిస్తున్నది. ఈ నేపథ్యంలో అర్హులైన జీవిత ఖైదీల విడుదలకు సంబంధించి పలు సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి ద్వారా ముఖ్యమంత్రికి తాజాగా మరోసారి ఈ విషయంపై పిటిషన్ సమర్పించింది. 

శ్రీ ఎ.రేవంత్ రెడ్డి,

గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం

(వి.శేషాద్రి, ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి ద్వారా, సీఎం కార్యాలయం)

విషయం: అంబేద్కర్ జయంతి సందర్భంగా 102 మంది జీవిత ఖైదీల విడుదల కోరుతూ మానవ హక్కుల వేదిక తరఫున వినతి

సుమారు రెండు వారాల క్రితం పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విడుదలకు అర్హులైన 102 మంది జీవిత ఖైదీల (వారిలో ఆరుగురు మహిళలు) జాబితా ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్లు మా వేదిక దృష్టికి వచ్చింది. మానవతా దృక్పథంతో కూడిన ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా, మీ నాయకత్వాన్ని మా వేదికతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.

ఈ నిర్ణయం న్యాయం, సంస్కరణ, మానవత్వం అనే విలువలను ప్రతిబింబిస్తుంది. అయితే, విడుదలకు అర్హులైన ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఈ నిర్ణయం అమలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయం వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపుతుంది. ఇదే సమయంలో, హోం శాఖ జారీ చేసిన జీవో నంబర్ 126, తేదీ 27.10.2025 ప్రకారం విధివిధానాలను అనుసరించి మరో జాబితా తయారు చేసే ప్రక్రియ పరిశీలనలో ఉందని మాకు తెలిసింది.

ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న 102 మంది జీవిత ఖైదీలను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విడుదల చేయాలని మేము వినమ్రంగా కోరుతున్నాం. ఇట్లా విడుదల చేయడం, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయం, సమానత్వం, మానవ గౌరవం అనే ఆదర్శాలకు యథార్థ నివాళిగా నిలుస్తుంది.  అలాగే, సంబంధిత విధానాల ప్రకారం తయారైన తదుపరి జాబితాలోని ఖైదీలను ఆగస్టు 15,వ తేదీన, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని వినమ్రంగా సూచిస్తున్నాం.

ఈ విడుదల కోసం ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా ప్రకటించాలని మనవి. ఇది సంబంధిత కుటుంబాలకు అపారమైన ఆనందాన్ని కలిగించడమే కాకుం డా, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. జీవిత ఖైదీల విషయంలో న్యాయం, సంస్కరణ, మానవత్వం, అనే విలువలను ప్రభుత్వం కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాం.

- ఎస్ జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక కోఆర్డినేషన్ 

కమిటీ సభ్యులు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్

- డా. ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

- సంజీవ్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి