15 July, 2026 | 12:40 AM

ఘట్‌కేసర్ బైపాస్ పనుల్లో జాప్యం

15-07-2026 12:00 AM
  1. నరకప్రాయంగా మారిన రహదారి
  2. తరచూ ట్రాఫిక్ జామ్‌తో తప్పని ఇబ్బందులు

ఘట్కేసర్, జూలై 14 (విజయక్రాంతి) : హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఘట్కేసర్ బైపాస్, ఉప్పల్-ఘట్కేసర్ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్), స్థానిక రైల్వే  బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం ప్రయాణికులకు, స్థానిక ప్రజలకు శాపంగా మారింది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పనుల వల్ల నిత్యం వేలాది మంది వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఘట్కేసర్ బైపాస్ మీదుగా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి, వరంగల్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే బ్రిడ్జి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో సర్వీస్ రోడ్లు ఇరుకుగా మారి, ముఖ్యంగా వారాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.

శిథిలావస్థకు చేరిన రహదారులు

ఘట్ కేసర్ పట్టణంలో వంతెన నిర్మాణ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. వాహనాల రాకపోకలతో ధూళి విపరీతంగా రేగుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు.

కూల్చివేతల శిథిలాలు

రైల్వే వంతెన నిర్మాణ పరిధిలో భూసేకరణ, ఇళ్ల కూల్చివేతల వల్ల ఘట్కేసర్ బస్టాండ్ నుంచి ధర్మశాల వరకు ఆ ప్రాంతమంతా శిథిలాల దిబ్బగా మారింది. దీనివల్ల కాలినడకన వెళ్లే స్థానికులు, బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తీవ్ర అసహనంలో స్థానికులు, వాహనదారులు

కాంట్రాక్ట్ సంస్థల మార్పు, భూసేకరణ ఆలస్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు పడకపోవడంపై స్థానిక ప్రజలు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత దూరం దాటడానికి గంటల సమయం పడుతోంది. ధూళి కాలుష్యం వల్ల ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం అని అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేయాలి వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

స్థానిక వాహనదారులు పెరిగిన ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి ప్రయాణికుల కష్టాలను తీర్చడానికి సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.