ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ వైద్యం
ఇబ్రహీంపట్నంపై మంత్రి దామోదర, ఎమ్మెల్యే మల్‌రెడ్డి ప్రత్యేక దృష్టి
ఇబ్రహీంపట్నం , జూలై 14 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, పేదలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శాఖా ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆసుపత్రుల పనితీరు, సిబ్బంది కొరత, మౌలిక వసతులపై శనివారంలోగా పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, వైద్యులు సమయపాలన పాటిస్తూ రాత్రి వేళల్లోనూ అందుబాటులో ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.






