2 September, 2026 | 6:18 PM

హఫీజ్‌పేట్‌లో కూల్చివేతలు..సుభాష్ నగర్‌లో ఉద్రిక్తత

02-09-2026 | 05:42pm

ఇళ్లు కూల్చవద్దంటూ బాధితుల ఆందోళన భారీ పోలీసు బందోబస్తు

శేరిలింగంపల్లి,సెప్టెంబరు 2 (విజయక్రాంతి): మాదాపూర్ సర్కిల్ 50 పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌ సుభాష్ చంద్రబోస్ నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మొదలవడంతో ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణంలో మునిగింది. మున్సిపల్ అధికారులు యంత్రాలతో చర్యలు ప్రారంభించగానే స్థానికులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని, సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. కొందరు మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ కూల్చివేతను నిలిపివేయాలని కోరారు.

ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మియాపూర్ పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు, అధికారుల మధ్య సంభాషణ కొనసాగుతుండగా కూల్చివేతలు పాక్షికంగా కొనసాగాయని స్థానికులు తెలిపారు. భూమి వివాదాలు, అనుమతులు లేని నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, అయితే పేద కుటుంబాల ఇళ్లపైనే దాడి జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హఫీజ్‌పేట్‌లో సర్వే నంబర్ 80 చుట్టూ దశాబ్దాలుగా భూ వివాదాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో గతంలోనూ కూల్చివేతలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.పరిస్థితి నియంత్రణలో ఉందని పోలీసులు చెబుతున్నా, బాధితులు మాత్రం తమ నివాసాలను కాపాడుకునేందుకు ఆందోళన చేస్తున్నారు.