యాపిల్ నూతన సీఈఓగా జాన్ టెర్నస్.. వేతనం ఎంతంటే.. ?
టెక్ దిగ్గజానికి 15 ఏళ్ల పాటు నాయకత్వం వహించిన టిమ్ కుక్(Tim Cook) స్థానంలో జాన్ టెర్నస్(John Ternus) అధికారికంగా యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన టెర్నస్, 2021 నుండి కాలిఫోర్నియాలోని క్యూపెర్టినోకు చెందిన ఈ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో యాపిల్ ఈ మార్పును ప్రకటించినప్పుడు, కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఉంటారని కంపెనీ తెలిపింది.
టెర్నస్ కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తి. అతను 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ బృందంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగాడు. 2013లో హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులై, 2021లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పదోన్నతి పొందారు.
జాన్ టెర్నస్ కు సంస్థ భారీ వేతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆయన వార్షికి వేతనం, షేర్ల రూపంలో లభించే ప్రోత్సాహకాలతో కలిపి మొత్తం 58 మిలియన్ డాలర్లు అందుకోనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఉన్న కుక్ సుమారు 47 మిలియన్ డాలర్లు అందుకున్న వివరాలను అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ కి సమర్పించిన నివేదికలో యాపిల్ పేర్కొంది.






