వైశ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి
ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): వైశ్యుల న్యాయమైన డిమాండ్లను వచ్చే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని మాజీ స్పీకర్, శాసనమండలి సభాపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అన్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ కు నిధులు కేటాయించ లేకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
సోమవారం వైశ్య వికాస వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్య నారాయణ గుప్త ఆధ్వర్యంలో వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా సిరికొండ మధుసూదనా చారి హాజరై మద్దతు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యులు చేసే తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేసే పోరాటంలో బీఆర్‌ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ దీక్ష కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు కాచం సుష్మ, కండె హరి ప్రసాద్, కోటగిరి దైవాధీనం, రామ్ నగేష్, కూర రమేష్, కొత్త రవి, కె.వి.ప్రతాప్, కాచం సాయి, వీరేందర్, నిఖిల్, కాచం శేఖర్, గిరి, శ్యాంప్రసాద్, రాంబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






