28 July, 2026 | 2:06 AM

సర్‌పై మరింత అప్రమత్తం

28-07-2026 01:18 AM

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపైనా దృష్టి 

రాష్ట్ర నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం 

ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మీనాక్షినటరాజన్ భేటీ పెద్దల దృష్టికి 21 ఏళ్లకే చట్టసభలకు యువత అంశం

నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఖర్గే, రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలను కలువనున్న సీఎం రేవంత్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): తెలంగాణలో పార్టీని సంస్థాగ తంగా మరింత బలోపేతానికి చర్యలు తీసుకుంటూనే ‘సర్’ పైన అప్రమత్తంగా ఉండి సీరియస్‌గా తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్ఠానం సూచించింది. వరుసగా ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. పార్టీ హైకమాండ్‌తో రాష్ట్ర రాజకీయాలు, సంస్థాగత వ్యవ హారాలపైనా దిశానిర్దేశం తీసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లాల వారీగా నాయకుల మధ్య పంచాయితీలపై అధిష్ఠానం ఆరా తీసినట్లు తెలిసింది.  యువ తకు 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా సవరణ చేయాల్సి ఉందని, అందుకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే అంశాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ దృష్టికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇదే అంశాన్ని ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు సమాచారం.

సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరాభవన్‌లో ఏఐసీసీ ప్రధానకార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచా ర్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌సావంత్, వంశీచందర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. దాదాపు 2 గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణలో పార్టీ సంస్థాగత కార్యక్రమాలు, సర్‌పై క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరు, తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య నెలకొన్న సమస్యలతో పాటు పార్టీ, ప్రభుత్వ పదవులపైన కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

యువతను కాంగ్రె స్ పార్టీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు ఉండాలని చర్చించినట్లుగా తెలిసింది. అందుకు ఇండియా కూటమి నేతలను కూడా ఒప్పించే విధం గా చూడాలనే అభిప్రాయానికి వచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఇండియా కూట మి నేతలను కలిసి.. 21 ఏళ్లకే యువత పోటీ చేసే అంశంపై వివరించనున్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రాభివృద్ధికి సమస్యలు, నిధుల అశంపైనా పూర్తిగా ప్రస్తావించనున్నారు.

రేపు మీనాక్షినటరాజన్‌తో సమావేశం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్మా ణం కోసం పోలింగ్ బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జరిగిన సంస్థాగత కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్‌లో ఇదే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించినట్లుగా పార్టీ నేతలు తెలిపారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాల పనితీరుపైనా కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారు.

సర్ పనులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ఉండకూడదని పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ సూచించారు. ఇదే అంశంపై బుధవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ న్ అధ్యక్షతన టీపీసీసీ కో ఆర్డినేషన్ కమిటీతో సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలోనూ పార్టీ సంస్థాగ త కార్యక్రమాలు, సర్‌పైన చర్చించనున్నారు.