28 July, 2026 | 2:09 AM

బలప్రయోగం సరికాదు

28-07-2026 01:22 AM

శాంతియుత నిరసన రాజ్యాంగపరమైన హక్కు

  1. ఆందోళన చేస్తున్నారని లాఠీచార్జి తగదు
  2. ఢిల్లీ పోలీసులకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మందలింపు
  3. విద్యార్థులపై లాఠీచార్జిని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ
  4. విధుల్లో పోలీసులు క్షతగాత్రులవడంపై ఆందోళన

న్యూఢిల్లీ, జూలై ౨౭: ‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగాన్ని సమర్థించలేం. నిరసన తెలిపే హక్కు పౌరులకు భారత రాజ్యాం గం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందే. కేవలం నిరసన తెలుపుతున్నారన్న కారణంతో లాఠీచార్జి తగదు. మితిమీరిన బలప్రయోగానికి వీల్లేదు’ అంటూ ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు తీవ్రస్వరంతో మందలించింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల ౨౦న విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు చేపట్టిన ‘చలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమంలో జరిగిన లాఠీచార్జి, పెల్లెట్ గన్స్, బాష్పవాయు గోళాల ప్రయోగంపై స్వతంత్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్య త వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై జరిగిన బలప్రయోగంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కోరుతూ పలువురు అత్యున్నతన్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.

పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు అడ్వొకేట్లు తమ వాదనలు వినిపిస్తూ.. నిరసన సమయంలో సాదాసీదా దుస్తులు (సివిల్ డ్రెస్) ధరించిన పోలీసులు, భద్రతా బలగాల మోహరింపును నిషేధించాలని కోరారు. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. గతంలో డీకే బసు వర్సెస్ పశ్చిమ బంగాల్ ప్రభుత్వ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం.. అధికారిక గుర్తింపు కార్డులు లేకుండా పోలీసులు సాధారణ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం చట్టవిరుద్ధమని గుర్తుచేశారు. విద్యార్థులపై బలప్రయోగంపై విచారణకు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతత్వంలో ప్రత్యేక విచారణ బృందం (సిట్) లేదా జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

మహిళా ఆందోళనకారులపై భౌతికదాడులకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలని విన్నవించారు. సీసీ టీవీ ఫుటేజీ, వీడియో రికార్డింగ్స్ వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరిచేలా చూడాలని కోరారు. క్షతగాత్రులైన నిరసనకారులకు కేంద్రం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు.

నీలేకని కమిటీ నివేదిక తర్వాత స్పందిస్తాం: సీజేఐ

పిటిషనర్ల తరఫు వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ‘దేశంలో ఎవరైనా ఎక్కడైనా శాంతియుతంగా నిరసన తెలుపవచ్చు. నిరసన తెలపడం రాజ్యాంగపరమైన హక్కు. ఒకవేళ ఎవరైనా అసాంఘిక శక్తులు చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, కేవలం నిరసన చేస్తున్నారన్న కారణంతో ఆందోళకారులపై బలప్రయోగం తగదు’ అని ఢిల్లీ పోలీసులను మందలించారు.

అలాగే, దేశంలో నిరసన కార్యక్రమాలను నియంత్రించేందుకు పోలీసు, భద్రతా బలగాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్ అమలు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. నిరసన సమయంలో విధులు నిర్వర్తిసూ గాయపడిన పోలీసు సిబ్బంది భద్రతపైనా ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో గాయపడిన పోలీసు సిబ్బంది కుటుంబాల ప్రతినిధులు సైతం ఈ విచారణలో భాగస్వాములయ్యేందుకు అనుమతించారు.

అలాగే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీని నివారణ, ఆన్‌లైన్ పరీక్ష విధానం అమలుపై కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ అంశాన్ని ప్రస్తావించింది. నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ ఆన్‌లైన్ పరీక్షా విధానంపై ఎలాంటి సూచనలు చేస్తుందో వేచి చూద్దామని తెలిపారు. కమిటీ నివేదికను బట్టి, తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. 

విద్రోహ శక్తులపై చర్యలు అవసరం: జస్టిస్ బాగ్చీ

‘చల్ పార్లమెంట్’ నిరసన సమయంలో పోలీసులపై జరిగిన దాడిపై జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి స్పందిస్తూ.. నిరసన సమయంలో పోలీసులపై ఆకతాయిలు దాడి చేయ డంపై ఆందోళన వ్యక్తం చేశారు. విధులు నిర్వర్తించే సమయంలో పోలీసులకు తగిన రక్షణ పరికరాలు, హెల్మెట్లు ఎందుకు ఇవ్వలేదని, ఈ అంశంపై ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

అలాగే, నిరసన కార్యక్రమాల్లోకి చొరబడి, విధ్వంసం సృష్టించే విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకునే అధికారాలు ప్రభుత్వ యంత్రాంగానికి ఉండాలని నొక్కి చెప్పారు. ప్రాణం ఎంతో విలువైందని, నిరసన కార్యక్రమాలు చేపట్టే సమయంలో ప్రతి నిరసనకారుడూ స్వీయ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ పిటిషన్లపై విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.