చర్మవాద్యం బుడబుక్కలు
బుడ్‌బుడ్ బుడుక్ మని శబ్దం చేసే వాద్యాన్ని బుడుబుక్క అంటారు. దానిని వాయించే వారిని బుడుబుక్కల వారు అంటారు. దీనిని వాయిస్తూ ఊరు తిరుగుతారు. అవసరం అయిన కొంతమందికి జరగబోయేది చెబుతారు. వీరి వేషం ప్రత్యేకంగా ఉంటుంది. నల్లని అంగి, తెల్లని పంచా, ఎర్రటి తలపాగా ధరిస్తారు. వీరు వరసగా రెండుమూడు నెలలు ఊళ్ళు సంచారం చేస్తారు. పాత బట్టలు సేకరించి వాటిని బొంతలుగా కుడతారు.
బుడికె వాద్యాన్ని జిట్రేగి, వేప, తునికి కర్రతో చేస్తారు. దీని చర్మం పలచగా ఉంటుంది. దానిని ‘బుక్కి’ అంటారు. తంగేడు వేరులతో బుడికెని తాళ్ళలాగా చుడతారు. పెద్ద చేతిలో పట్టేంత వాద్యం ఇది. దీని రెండువైపులా కర్రతో చర్మాన్ని తాపుతారు. ఏడు రంధ్రాలు చేసి తాళ్ళతో గట్టిగా కడతారు. మార్ఫాలాగా గట్టిగా ఉంటుంది. వాద్యం రెండు చివరల మధ్య సన్నని నూలు దారం కడతారు. ఆ తాడు చివరన ముళ్లు వేసి చిన్న బుడిపె చేస్తారు. దానిని కుడి ఎడమవైపు తిప్పితే ఆ బుడిపెలు బిగిసిపట్టిన చర్మానికి తగిలి బుడుక్, బుడుక్ శబ్దం వస్తుంది. వేగంగా తిప్పితే దాని శబ్దంతో పాటు బుడిపెలు తగిలి పెద్ద శబ్దాలు వస్తాయి. ఈ వాద్యం మూడు రకాలుగా వాయిస్తారు.
వాదకుడు బొటనవేలు, చూపుడు మధ్య వేళ్ళతో బుడుబుక్క మధ్య భాగాన్ని పట్టుకుని వివిధ గతి వేగాలతో ఊపుతాడు. ఊపే విధానం వల్లే లయాత్మకమైన శబ్దం ఏర్పడుతుంది.






