calender_icon.png 13 November, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది కర్ణుడి కోట

11-09-2024 12:00:00 AM

కరన్ కోట్ గ్రా మం వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో వుంది. గ్రామంలో సిమెంట్ కార్పొరేషన్ ఇండియా వా రి సిమెంట్ ఫ్యాక్టరీ వుంది. కరన్ కోట్ గ్రామానికి పేరు కర్ణుని కోట నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. మహాభారత కాలంలో కర్ణుడు ఇక్కడే వుండే వాడ నీ వూరిలో వున్న కోట ఆయన కట్టించిందేననీ స్థానిక కథనం. వూరిలో పాతకాలంనాటి బురుజులుగల కోట వుంది. చాలాభాగం కూలిపోయింది. సింహద్వారం, రెండు బురుజులు ఇంకా వున్నాయి. 

ప్రాంగణంలో 7 వీరగల్లులు, ఒక నాగశిల్పం వున్నాయి. వీరగల్లుల శిల్పాలు గతంలో అక్కడ జరిగిన యుద్ధాన్ని స్మరించే సాక్ష్యాలు. ఈ వీరగల్లులలో రెండంతస్తులవి, మూడంతస్తులవి వున్నాయి. కొన్నింటిలో అశ్వసైనికుల యుద్ధదృశ్యాలు, కొన్నింటిలో ఎక్కటివీరుల అమరత్వాలు చెక్కబడ్డాయి. 

వాటికి దగ్గరే వున్న సప్తమాతృకల ఫలకంలో నలుగురు మాతృకలే మిగిలివున్నారు. కోటలోపల వీరభద్రేశ్వరాలయం వుంది. గర్భాలయ ముఖద్వారంపై కలశాలున్నాయి. శాసనాలు ఏవీ కనబడలేదు. వూరి మధ్యలో నాగుల కట్టవుంది, దానిపై తలలేని వినాయక విగ్రహం వుంది. 2004లో గిరీశ్ గారు చూసినప్పుడు నాగుల శిల్పాలు నిలబెట్టబడి వున్నాయి. కానీ ఇప్పుడు నాగులశిల్పాలన్నీ పడుకోబెట్టి సిమెంటుపూతతో ఫిక్స్ చేసేశారు. 

వూరిలో చౌడమ్మగుడి వుంది. కోట ముఖద్వారం ముందు ఆంజనేయ ఆలయం వుంది. పూర్వం హనుమంతుని శిల్పం ఎలాంటి ఆధారంలేకుండా గాలిలో తేలుతూ వుండేదనీ, పాదాలకింద కాగితంపెట్టి ఇవతలకు తీసేవారమనీ స్థానికులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఖాళీ క్రమేణా పూడుకుపోయిందని చెప్పారు. ఈ గ్రామం చంద్రవంచ నది వడ్డున వుంది. ఈ చంద్రవంచ నది కాగ్నా అనే మరో నదికి ఉపనది.

కరన్ కోట్ అనే పేరు వల్ల ఈ గ్రామం పూర్వం బౌద్ధం విలసిల్లిన ప్రాంతమని అనిపిస్తోంది. చుట్టుపక్కల సంగం కలాన్(సంగమం), శిరిగిరిపేట్(శ్రీగిరి, శ్రీపర్వతం), కోటబాస్పల్లి, మిట్టబాస్పల్లి వంటి వూరిపేర్లు ఇక్కడ బౌద్ధం ఆనవాళ్ళు వున్నాయని సూచిస్తున్నాయి. ఇదంతా సున్నపురాయి దొరికే ప్రాంతం.

శ్రీరామోజు హరగోపాల్