13 August, 2026 | 5:13 PM

సేకరించని ఎన్యూమరేషన్ ఫారమ్‌ల వివరాలను వెంటనే వెల్లడించాలి

13-08-2026 04:06 PM

డీసీసీ అధ్యక్షులు బట్టు కరుణాకర్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంకా సేకరించబడని ఎన్యూమరేషన్ ఫారమ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే వెల్లడించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారమ్ అందకపోవడం వల్ల అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరును కోల్పోకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఇల్లు తాళం వేసి ఉండటం, ఓటరు వేరే ప్రాంతానికి మారడం, చిరునామా గుర్తించలేకపోవడం తదితర కారణాలతో ఫారమ్‌లు సేకరించబడని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా గుర్తించి, వారికి మరోసారి అవకాశం కల్పించాలని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అర్హత కలిగిన ప్రతి ఓటరుకు న్యాయం జరిగే విధంగా కొనసాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.