డొక్కు బస్సులు.. నిత్య కష్టాలు!
- ఆర్టీసీలో తగ్గిన బస్సులు, సిబ్బంది
- తరచూ మొరాయిస్తున్న ప్రగతి రథాలు
- మహాలక్ష్మీ పథకం అమలు తర్వాత మూడు రెట్లు పెరిగిన ప్రయాణికులు
- కష్టాలతో ఆర్టీసీ కార్మికుల సహవాసం
- కొత్త బస్సులు, నియామకాలు ప్రకటనలకే పరిమితం
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా 3 రోజుల్లోనే 1.74 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఓవైపు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు కార్మికులు మాత్రం కష్టాలతో సహజీవనం చేస్తున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా యాజమాన్యం అందుకు తగ్గట్టు బస్సులను, సిబ్బందిని నియమించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం, యాజమాన్యం తమ విజయంగా పేర్కొంటుంటే కార్మికులు మాత్రం తమ గోడు వినండని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డొక్కు బస్సులతో తాము సహజీవనం చేస్తున్నామని, యాజమాన్యం మాత్రం ఆక్యుపెన్సీ రేషియో చర్చల్లో పడి తమను నిర్లక్ష్యం చేస్తోందని వాపోతున్నారు.
ఆర్టీసీకి భారీగా ప్రయాణికుల తాకిడీ
ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సు ల్లో ప్రయాణించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ ప్రయాణికులతో పోలిస్తే ఉచిత ప్రయాణికుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ‘మహా లక్ష్మి’ కి ముందు ఉన్న ఆక్యుపెన్సీ రేషియా ఇప్పుడు దాదాపుగా రెట్టింపైంది. రాఖీ పండుగ సందర్భంగా ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించిన వారి సంఖ్య 63 లక్షలు. వీరిలో మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్న మహిళల సంఖ్య 41.74 లక్షలు.
38 లక్షల కిలోమీటర్ల మేర బస్సు లు తిరిగాయి. మహాలక్ష్మి ద్వారా రూ.17 కోట్లు, రెగ్యులర్ టిక్కెట్ల ద్వారా రూ.15 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. ప్రస్తు తం ప్రతి రోజు ఆర్టీసీలో సుమారు 53 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. కా గా, 2023 నవంబర్‌లో ఆర్టీసీ బస్సుల్లో ని త్యం ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షలు మాత్రమే. అంటే ప్రయాణికుల సంఖ్య ఏమేరకు పెరిగిందో అర్థమవుతుంది.
బస్సులు, సిబ్బంది మాత్రం పెరగడం లేదు
అర్టీసీలో ఏటా పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ, కొత్తగా మాత్రం నియామకాలు లేవు. అడపాదడపా కొత్త బస్సులను తీసుకు వస్తున్నా కాలం చెల్లిన బస్సుల తొలగింపు సైతం కొనసాగుతోంది. ఫలితంగా బస్సుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. గత ఏడాది డిసెంబర్‌లో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. జూన్ 2024 నాటికి ఆర్టీసీలో 40,415 మంది సిబ్బంది ఉండగా, 9,149 బస్సులు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పిడినప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీకి 10,450 బస్సులుండేవి. 57,254 మంది కార్మికులుండేవారు. ఇప్పుడు బస్సులు, కార్మికులు తగ్గి పోయారు. గతంలో అద్దె బస్సులు 1,431 మాత్రమే ఉంటే ఇప్పుడవి 2,750కి చేరుకున్నాయి. క్రమేపీ ఆర్టీసీ బస్సులు తగ్గి అద్దె బస్సులే ఎక్కువయ్యే ప్రమాదమూ పొంచి ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఈ బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కార్మికులకు అదనపు డ్యూటీలు వేస్తున్నారు. టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.
పాత బస్సులతో ఇక్కట్లు
- ఈ నెల 21న కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట వద్ద నడుస్తున్న బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమా దం తప్పింది.
- ఈ నెల 18న వంద మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు టైర్లు ఊడాయి. జగిత్యాల జిల్లా రాయికల్ రహదారిపై నిర్మల్ డిపోనకు చెందిన బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తుం డగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ చాకచక్యం వల్లే ప్రమా దం తప్పింది. కాలం చెల్లిన బస్సు కావడంతోనే ఈ పరిస్థితి దాపురించింది.
- గత ఏడాది డిసెంబర్ 24న 80 మందితో వెళ్తున్న హుజూరాబాద్ పల్లెవెలుగు బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి. బస్సు నెమ్మదిగా వెళ్తున్నందున ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
- శ్రీశైలం, వికారాబాద్ తదితర ఘాట్ రోడ్లలో ఎక్కువ మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లు ఘాట్ ఎక్కలేక ఆగిపోతున్నాయి. ప్రయాణికులు దిగి న డుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.






