20 May, 2026 | 6:23 AM

కల్చరల్ సెంటర్‌తో ఒంటరితనం దూరం

24-08-2024 12:34 AM

రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి  

జూబ్లీహిల్స్‌లో కల్చరల్ సెంటర్ ప్రారంభం

హాజరైన మంత్రి కొండా, సినీ నటుడు చిరంజీవి

హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు, యాంత్రిక జీవనానికి కల్చరల్ సెంటర్లు పరిష్కార మార్గాన్ని చూపిస్తాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కల్చరల్ సెంటర్స్‌తో ఒంటరితనం దూరం అవుతుందని చెప్పారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో కల్చరల్ సెంటర్‌ను మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు చిరంజీవితో కలిసి కోమటిరెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 10 వేల గజాల్లోనే ఇప్పుడు అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగిన తర్వాత ఆత్మహత్యల శాతం పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ఇలాంటి కల్చరల్ సెంటర్లు ఉపశమ నాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.

ఈ సెంటర్‌లో వసతులు చూసిన తర్వాత.. తనకు కూడా సభ్యత్వం తీసుకోవాలనిపిస్తోందని చమత్కరించారు. ఈ భవనానికి ఏదైనా అదనపు సౌకర్యాలు అవసరమైతే తాను కల్పి స్తానని హామీ ఇచ్చారు. గురువారం పుట్టిన రోజు జరుపుకొన్న సినీనటుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.