ప్రమాదాల నివారణకు కృషి
మంత్రి పొన్నం ప్రభాకర్
సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాల అమలుపై సమీక్ష
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): అన్ని శాఖల అధికారుల సమిష్టి కృష్టితోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలుగుతామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాల అమలుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. అన్ని జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రదేశాల వివరాలను 108 అంబులెన్స్ సర్వీసు, పోలీ సు రికార్డుల నుంచి గుర్తించి ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
మేజర్ ప్రమాదాలు జరిగే రూట్లలో అంబులెన్స్ సర్వీస్, క్రిటికల్ కేర్ సర్వీస్‌లపై సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల సమయాల్లో మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబులెన్స్, హాస్పిటళ్ల మధ్య సమన్వ యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలు, మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేవించారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. 2023లో 22,903 రోడ్డు ప్రమాదాలు జరుగగా అందులో 7,186 ప్రాణాం తక ప్రమాదాలు, 2,476 తీవ్రమైన ప్రమాదాలు, 10,404 చిన్న ప్రమాదాలు, 2,747 సాధారణ ప్రమాదాలు ఉన్నాయని వెల్లడించారు.
జిల్లాలవారీగా అన్ని శాఖల అధికారు లతో సమీక్ష నిర్వహించి ప్రమాదాల నివారణపై వ్యూహాత్మక కార్యాచరణ రూపొందిం చాలని సూచించారు. అన్ని శాఖల సమిష్టి కృషితో తెలంగాణ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతోపాటు వాహనదారుల భద్రత సాధ్యమవుతుందని సమావేశంలో నిర్ణయించారు. రవాణాశాఖ కమిషనర్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాల శాఖ ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అథారటి ఆప్ ఇండియా అధికారులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






