వచ్చే ఏడాది చివరికల్లా.. దేవాదుల పథకం పూర్తి
- 38.16 టీఎంసీలతో 10 జిల్లాలోని 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు
- సవరించిన అంచనాలతో పెరిగిన మొత్తం వ్యయం రూ. 18,400 కోట్లు
- ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ. 14,422 కోట్లు
- మరో 3,978 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిర్ణయం
- ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి
- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దేవాదుల ఎత్తిపోతల పథకం (జేసీఆర్‌డీఎల్‌ఐఎస్) 2027 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.
38.16 టీఎంసీల నీటితో హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలకు చెందిన 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.
అందులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూట్ మ్యాప్ రూపొందించి పనులలో వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే దేవాదుల ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై శనివారం సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీఎస్ రామకృష్ణారావు, ఎంపీ బలరాం నాయక్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, మురళీ నాయక్, దొంతు మాధవరెడ్డి, జీ.సత్యనారాయణ, రామచంద్ర నాయక్, పల్లా రాజేస్వర్ రెడ్డి, నీటిపారుదలశాఖ ప్ర ధాన కార్యదర్శి ఈ శ్రీధర్, సహాయ కార్యదర్శి కే శ్రీనివాస్, సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కు మార్ రెడ్డి మాట్లాడుతూ 2004-2005లో అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో రూ. 6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణం గడిచిన బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురికా వడంతో అంచనా వ్యయం 18,400 కోట్ల కు పెరిగిందని ఆయన తెలిపారు.ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 14,422 కోట్లు ఖర్చు పెట్టామని మరో 3,978 కోట్లతో 2027 డిసెం బర్ మాసంతానికి పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేసినట్లు ఆయన చెప్పారు.
మొత్తం మూడు దశలలో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని 16 ప్యాకేజిలుగా విభజించి నిర్మాణం పనులు చేపట్టిన ట్లు తెలిపారు. మొదటి దశ ద్వారా 1.23 లక్ష ల ఎకరాలకు రెండో దశ ద్వారా 1.93 లక్షల ఎకరాలకు మూడో దశ ద్వారా 2.39 లక్షల 3 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. 20 పంప్ హౌజ్ లు, 642 కిలోమీటర్ల పైపు లైన్లు, 57.16 కిలోమీటర్ల సొరంగ మార్గం, 20 రిజర్వాయర్లు, 306 ప్రధాన కాలువలు, 2,185 కిలోమీటర్లు పంపిణీ కాల్వలకు ఈ ప్రాజెక్టు విస్తరించి ఉందని పేర్కొన్నారు.
ఆసియాలోనే అతి పొడవైన 49 కిలోమీటర్ల డీ -ఆకా రపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్న మంత్రి, ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫ రా కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ అనుసంధానం వల్ల ఏడాది పొడవునా నీటి లభ్యత దాదాపు నిరంతరంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పను లు 87.70 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
ప్రధాన పంప్ హౌసులు, పైప్‌లైన్ వ్యవస్థలు, సొరంగ తవ్వకాల పనులు ఎక్కువగా పూర్తయ్యాయని చెప్పారు. అయితే కాల్వల లైనింగ్, పంపిణీ కాల్వల పనులు, కొన్ని నిర్మాణాల ఆలస్యం, భూసేకరణ సమస్యలు ఇంకా పూర్తి స్థాయి వినియోగాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఫేజ్ ప్యాకేజీ- 45 పూర్తిగా ముగిసిందని, ప్యాకేజీ- 46 పనులు 96.86 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
అయితే బొల్లికుంట సమీపంలో 700 మీటర్ల కాల్వ లైనిం గ్ పనులు కోర్టు కేసు కారణంగా నిలిచిపోయి వేల ఎకరాలకు సాగునీటి లాభాలు ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పారు. ఫేజ్- హెడ్‌వర్క్స్, పంప్ హౌసులు, ప్రధాన పైప్‌లైన్ వ్యవస్థలు ఎక్కువగా పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్ ఘన్‌పూర్ పంపిణీ వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ తపాసుపల్లి, అశ్వరావుపల్లి, చిట్టకోడూరు పంపిణీ వ్యవస్థల పనులు భూసేకరణ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతున్నాయని ఆయన వివరించారు.
ఫేజ్--3ను అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన భాగంగా మంత్రి అభివర్ణించారు. ప్యాకేజీ- 6ను నిర్వహిస్తున్న పాత కాంట్రాక్టర్ పనులను సమయానికి పూర్తి చేయకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త సంస్థకు అప్పగించినట్లు అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. ప్రస్తుతం 3.33 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టిస్తుండగా, మరో 2.23 లక్షల ఎకరాలకు ఇంకా సాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉందన్నారు.
ముఖ్యంగా సూర్యాపేట, ములుగు, వరంగల్ రూరల్, సిద్ధిపేట జిల్లాల్లో ఆయకట్టు సృష్టి తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. భూసేకరణ ఈ ప్రాజెక్టులో ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు వివరించారు. మొత్తం 34,622 ఎకరాల అవసరం లో 31,963 ఎకరాలు ఇప్పటికే సేకరించగా, ఇంకా 2,659 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. పెండింగ్ భూసేకరణ కేసులను వెంటనే టోకెన్ దశకు తీసుకెళ్లి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ప్రతిపాదిత ఆయకట్టులోని సుమారు 39,651 ఎకరాల ప్రాంతం కొన్ని ప్రాంతాల్లో వేగంగా పట్టణీకరణకు లోనవుతున్నందున, సర్వే ఆధారంగా వాటిని ప్రాజెక్టు కమాండ్ ఏరియా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు. ఈ ప్రక్రియ పది రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. దీని వల్ల అవసరం లేని సాగునీటి డిమాండ్ తగ్గి, అనవసర భూసేకరణ ఖర్చులు నివారించవ చ్చన్నారు.
నిలిచిపోయిన ప్యాకేజీలను గుర్తిం చి అవసరమైతే వెంటనే కాంట్రాక్టులను రద్దు చేసి రీటెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని, పరిపాలనా అనుమతుల జాప్యాల వల్ల విలువైన సాగునీటి సామర్థ్యం నిలిచిపోవద్దు అన్నారు.
దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తెలంగాణలోని అనేక ఎండబారిన గ్రామాలకు తాగునీటి లభ్యత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబర్ 31 నాటికి పూర్తిచేయడానికి అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం, పరిపాలనా అనుమతులు అన్నీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.






