8 June, 2026 | 1:39 AM

అభివృద్ధి పనులు నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలి

08-06-2026 12:15 AM
  1. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
  2. రూ. 3.15 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం
  3. రూ. 33 కోట్లతో రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల అనుసంధాన పనులకు భూమిపూజ
  4.    50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

ముదిగొండ, జూన్ 7(విజయక్రాంతి): క్షేత్ర స్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముదిగొండ మండలంలోని యడవల్లి గ్రామంలో రూ.3.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు, ముదిగొండ మం డల కేంద్రంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈఆర్వో (ERO) కార్యాలయ భవనానికి, మండలంలో రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.33 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు రహదారుల అభివృద్ధి పనులకు కూడా ఉప ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. 

అనం తరం యడవల్లి లక్ష్మీపురం గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ముదిగొండ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఉప ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ సబ్స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని, గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు గ్రామ పంచాయతీ భవనం భవనం ఉపయోగపడనుందని తెలిపారు. 

ప్రజలకు విద్యుత్ సంబంధిత సేవలు మరింత సులభంగా అందించేందుకు ఈఆర్‌ఓ భవనం దోహదపడనుందని  అన్నారు. ముదిగొండ మండలంలో 33 కోట్లతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగు పడటంతో పాటు జాతీయ రహదారులతో అనుసంధానం బలోపేతం కానుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అన్నారు.

ఆసుపత్రి భవన నిర్మాణ అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహించాలని, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

పనుల పురోగతిపై నిరంతర సమీక్ష నిర్వహిస్తూ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రజలకు మెరుగైన మౌళిక సదుపాయాలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.   అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సుడా ఛైర్మెన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.