9 June, 2026 | 2:31 AM

నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

09-06-2026 12:31 AM

అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశం

ఆదిలాబాద్, జూన్ 8 (విజయక్రాంతి) : గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమగ్ర అభివృద్ధి కేవలం ప్రజా భాగస్వామ్యం తోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నార్నూర్ మండలం  కొత్తపల్లి (హెచ్) గ్రామంలోని నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవి వి గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ టాయిలెట్లను, పుల్లబాయి-దేవిదాస్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామసభలో గ్రామస్తుల నుంచి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న కలెక్టర్...వాటి పరిష్కారానికి తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, నిధులను సద్వినియోగం చేసుకుంటూ నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. వ్యవసాయం వర్షపాతం పైనే ఆధారపడి ఉన్నందున, రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని  సూచించారు.

ఆగస్టు 15 నాటికి ఆశించిన వర్షాలు పడకపోతే పెసర్లు, కందులు, మినుములు, సోయాబీన్ వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. ముందస్తు విత్తనాలు వేసి నష్టపోవద్దని, పదును పడ్డాకే విత్తాలని వ్యవసాయ అధికారుల సలహాలను గుర్తు చేశారు. అలాగే తక్కువ ధరకే అమ్మే నకిలీ విత్తనాలను నమ్మి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన లైసెనస్డ్ డీలర్ల వద్దే కొనుగోలు చేసి రసీదులు భద్రపరుచుకోవాలని హెచ్చరించారు.   

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, తహసీల్దార్ రాజలింగు, ఎంపీడీవో పుల్లారావు, సర్పంచ్ చవాన్ దిగంబర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.