26 June, 2026 | 8:14 PM

మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం

26-06-2026 07:12 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్‌ సర్కిల్ పరిధిలో నిర్వహించబడుతున్న మాతా నిమిషాంబదేవి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శుక్రవారం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ దేవి విశేష, అలంకరణలో అమ్మవారు భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు.

సువర్ణ కాంతులతో విరాజిల్లుతూ, లక్ష్మీ కళలతో దేదీప్యమానంగా, అపూర్వమైన ఆభరణ భూషణాలతో అలంకృతురాలై, దివ్య తేజోమయ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి మహిమాన్విత స్వరూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అమ్మవారి సన్నిధిలో వెలసిన ఆదివ్య కాంతులు, మంగళ వాద్యాల నాదాలు, భక్తుల నిమిషాంబ నామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించింది. అమ్మవారి ఈ మహాలక్ష్మీ స్వరూప దర్శనం సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యాలు, ఆరోగ్యం, ఆనందం, శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.