19-01-2026 12:00:00 AM
ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బందిపడ్డ భక్తులు
కొమురవెల్లి, జనవరి 18సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్ర హ్మోత్సవాలు ప్రారంభం కావడంతో శని ఆదివారాలలోభక్తులు భారీగా తరలివచ్చా రు. శనివారం రాత్రి వరకు మల్లన్న సన్నిధా నం కి చేరుకున్న భక్తులు మొదటగా ధూళి దర్శనం చేసుకున్నారు. పట్నం వారంగా పిలవబడే ఈ వారం జంట నగరల నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలంతా భక్తి జనసంద్రంగా మారాయి. డోలు డప్పుల చప్పులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
దిక్కులు పిక్కుటిళ్లేలా మల్లన్న స్మరణ తో ఆలయ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయ క్షేత్రంలో ఉన్న కోనేట్లో పుణ్యస్నానాలు ఆచరించి గర్భాలయంలో ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత గుట్ట పైనున్న ఎల్లమ్మ తల్లికి శివసత్తుల పూనకాలతో బోనాలు నివేదించి, ఒడి బియ్యం సమర్పించారు.
తల్లిని అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. నేడు తోట బావి వద్ద పట్నం, అగ్నిగుండం సోమవారం రోజున తోట బావి సమీపంలోని కళ్యాణ వేదిక వద్ద హైదరాబాద్ నగరానికి చెందిన యాదవులు సొంత ఖర్చులతో పట్నం, అగ్ని గుండాలను తయారుచేస్తారు. భక్తులు పట్నం, అగ్నిగుండారం దాటి మరల గర్భగుడిలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకొని, సమీపంలో ఉన్న కొండపోచమ్మ ఆలయానికి తరలి వెళ్తారు.
ట్రాఫిక్ ఆంక్షలతో ఇబ్బంది పడ్డ భక్తులు మల్లన్న సన్నిధానానికి భారీగా తరలివచ్చిన భక్తులకు పోలీస్ శాఖ కఠినమైన ఆంక్షలతో ఇబ్బందులు పడ్డారు. శనివారం నాడే క్షేత్రం చుట్టూ చెక్ పోస్ట్లు ఏర్పాటు ఏర్పాటుచేసి పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. వాహనాలకు పాసులు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చారు.
కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలుపుదల చేశారు. దీంతో కొంతమంది భక్తులు ముల్లెలను మూటలను మోసుకుంటూ ఆలయ సమీపానికి చేరుకోవడానికి తెగ ఇబ్బంది పడ్డారు. మరికొంతమంది ఎక్కడైతే వాహనాలను నిలుపుదల చేశారో అక్కడే బస చేశారు. అక్కడే బోనాలు వండి, బోనం ఎత్తుకొని ఎల్లమ్మ గుట్టపై తీసుకెళ్లారు.బస చేసిన చోట సరైన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు