calender_icon.png 20 January, 2026 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూరవిద్యతో 11 లక్షల మంది విద్యావంతులు

19-01-2026 12:00:00 AM

  1. 5లక్షల మంది మహిళలు కాలంతో పరిగెడితేనే అవకాశాలు
  2. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  3. వైస్ చాన్సలర్ గంట చక్రపాణి 

సిద్దిపేట, జనవరి 18 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటివరకు రాష్ట్రంలో 11 లక్షల మందికి పైగా విద్యను అభ్యసించారని, అందులో 5 లక్షల మంది మహిళలు ఉన్నారని యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గంట చక్రపాణి అన్నారు. సిద్దిపేటలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రద్ధానందం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాలం వెంట పరిగెడితేనే అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడం సాధారణమైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరపటం సిద్దిపేటలోనే పురుడు పోసిందని నిర్వహించిన కోఆర్డినేటర్ శ్రద్ధానందం, కళాశాల ప్రిన్సిపల్ సునీత, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆహ్వాన కమిటీ ప్రతినిధులను అభినందించారు. సిద్దిపేటలో ప్రారంభమైన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని చక్రపాణి తెలిపారు. తనకు తెలిసిన సుమారు 10వేల మందికి పైగా అంబేద్కర్ యూనివర్సిటీలో చదివి ప్రభుత్వ శాఖలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడ్డారని చెప్పారు.

చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి పదవులతో పాటు సుమారు 10మంది ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఆయనకు ఆయన కుటుంబానికి మాత్రమే లాభం కాదని సమాజానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని చెప్పారు. పూర్వ విద్యార్థులందరూ ఓపెన్ యూనివర్సిటీకి బ్రాండ్ గా నిలిచారని కొనియాడారు. సిద్దిపేటకు పూర్తిస్థాయి పీజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా సిద్దిపేట రీజినల్ ను ప్రకటించారు. మానవ సంబంధాలు కొరవడిన రోజుల్లో ఓపెన్ యూనివర్సిటీ అనేకమందికి విద్యను అందించి తోడ్పడిందన్నారు. ఇప్పటికే యూనివర్సిటీ ద్వారా కామన్వెల్త్ ఆఫ్ లర్నింగ్, హాయ్ బ్రో రేడియో స్టేషన్ వంటిది ప్రారంభించామని, రానున్న రోజుల్లో డిజిటల్ స్టడీ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఆదివారం కళాశాలకు రాకుండానే ఇంట్లోనే తరగతులు వినే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. 

ఆత్మీయంగా పలకరింపు.. 

1984లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక భాగంగా ఏర్పడిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రస్తుతం రీజినల్ స్టడీ సెంటర్ గా రూపొందిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత తెలిపారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైన యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన కోఆర్డినేటర్ శ్రద్ధానందం ను అభినందించారు. సిద్దిపేట స్టడీ కేంద్రంలో సుమారు 60 వేలకు పైగా ఉన్నత విద్యను అభ్యసించారని చెప్పారు.

2005లో ప్రత్యేక కేంద్రంగా ఏర్పడటం మరి కొంతమందికి ఉన్నత విద్య అందించడం సులభమైందన్నారు. డాక్టర్ శ్రద్ధానందం మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను ఒక వేదిక పైకి తేవడం తనకు దొరికిన అరుదైన అవకాశం గా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. థర్డ్ జెండర్స్, డ్రైవర్స్, ఆదివాసీలు, పిట్టల వాడలకు వెళ్లి డిగ్రీలో అడ్మిషన్స్ అందించడం తనకు సంతోషాన్ని కలిగించిందన్నారు.

భవిష్యత్తులో యూనివర్సిటీ ఆదేశాలను కౌన్సిలర్ల సహకారంతో స్టడీ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ విజయ్ కృష్ణారెడ్డి, అధికారులు వెంకటేశ్వర్లు, పుష్ప, రవీంద్రనాథ్ సోలోమోన్, అంజన్న, మాజీ ప్రిన్సిపాల్ పాపయ్య, వైస్ ప్రిన్సిపాల్ అయోధ్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.