8 August, 2026 | 5:04 PM

సింగరేణి యాజమాన్యం 12వ వేజ్ బోర్డు కమిటీని వెంటనే వేయాలి

08-08-2026 03:31 PM

ఈనెల 10న జీఎం కార్యాలయం ముందు ధర్నా

జాతీయ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు

భూపాలపల్లి, టౌన్ ఆగస్టు 08 (విజయ క్రాంతి): సింగరేణి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం వెంటనే 12వ వెజ్ బోర్డు వేతన కమిటీని వేసి వేగంగా అమలుపరచాలని ట్రేడ్ యూనియన్ జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సి ఐ టి యు సి నాయకులు మంద నర్సింగరావు, ఐ ఎన్ టి యు సి నాయకులు జోగబుచ్చయ్య, హెచ్ ఎం ఎస్ నాయకులు నరేష్ నేత లు డిమాండ్ చేశారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కొమురయ్య భవన్ లో జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కోల్ ఇండియా వ్యాప్తంగా 12వ పేజీ బోర్డు కమిటీ వేయాలని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ఈనెల 10న జిఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు పిలుపునిచ్చారు.

గతంలో 11వ వేజ్ బోర్డు ఆరు నెలల ముందే వేజ్ బోర్డు కమిటీ వేసిన కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 12వ వేజ్ బోర్డు సమయం దాటిన కమిటీ ఎందుకు వేయడం లేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. కలకత్తాలో కోల్ ఇండియా వ్యాప్తంగా ఏర్పాటుచేసి 12వ వేజ్ బోర్డు విషయం మాట్లాడకుండా లేబర్ కోడ్ లు అమలు గురించి మాట్లాడడం పై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఏ పరిశ్రమలో లేనంతగా సింగరేణి బొగ్గు రంగంలో కార్మిక కోడ్ లను అమలు చేయడంపై వారు మండిపడ్డారు. లేబర్ కోడ్ ల పేరుతో ఇంతవరకు 12వ పేజీ బోర్డుపై మాట్లాడకుండా కాలయాపన చేస్తున్న కార్మిక సంఘాలు ఆగ్రహించి కోల్ ఇండియా వ్యాప్తంగా ఈనెల 10న అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు వారు పేర్కొన్నారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బి ఎం ఎస్ పాల్గొనక పోవడం దురదృష్టకరమని, వేజ్ బోర్డు విషయంలో వారు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా  సెప్టెంబర్12 న రాంచీలో జరిగే సదస్సులో వేజ్ బోర్డు విషయంపై స్పష్టత రాకుంటే కోల్ ఇండియా వ్యాప్తంగా సమ్మె తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఇప్పటికైనా వెంటనే వేజ్ బోర్డు కమిటీని వేయాలని జిఎం కార్యాలయాల ముందు సోమవారం జరిగే ధర్నా కార్యక్రమానికి కార్మికులు ట్రేడ్ యూనియన్ సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామ్ చెందర్, ఐలయ్య, బీమనాదుని సత్యనారాయణ, రామచందర్, సిఐటియు నాయకులు దుడ్డేల సాయిలు,రమేష్, హెచ్ఎంఎస్ నాయకులు మల్లేష్ పాల్గొన్నారు.