7 March, 2026 | 11:31 AM

మొన్న గంగని చూసిర్రు.. ఇయ్యాల పెనుగంగని సూడుర్రి!

07-03-2026 12:00 AM

శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ‘ఏ బ్లడ్ ఫెస్ట్’ అనేది ఉపశీర్షిక. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో రూపొందిస్తున్నారు సంపత్ నంది. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం శర్వా కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆయన మేకోవర్ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక తాజాగా శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ శుక్రవారం ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో శర్వా పూర్తిగా మాసీ, ఇంటెన్స్ అవతార్ లో ఆకట్టుకుంటున్నారు. రగ్గడ్ జుట్టు, గడ్డంతో ఆయన రా, రెబెలియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పెదవుల మధ్య బీడీ పెట్టుకుని, దాని నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్న పొగ ఆయన పాత్రలోని అటిట్యూడ్‌ను మరింత హైలైట్ చేస్తోంది. శర్వానంద్ ఈ సినిమాలో ‘గంగ’ అనే పాత్రలో కనిపించనున్నారు. అందుకే తాజా పోస్టర్‌ను డైరెక్టర్ సంపత్ నంది సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. ‘మొన్న గంగని చూసిర్రు.. ఇయ్యాల పెనుగంగని సూడుర్రి’ అంటూ వ్యాఖ్యను జోడించారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చుతుండగా, సినిమాటోగ్రఫీని కిషోర్ కుమార్ అరోకియా నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె పనిచేస్తున్నారు. 

‘బైకర్’ నుంచి స్ఫూర్తిదాయక గీతం విడుదల 

శర్వా హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, -ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో మాళవిక నాయర్ కథానాయిక. రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. భారతదేశంలో తొలి మోటోక్రాస్ మూవీ, హై-ఆక్టేన్ రేసింగ్ యాక్షన్‌తోపాటు భావోద్వేగాలు నిండి ఉన్న కథతో ఈ సినిమా రూపొందుతోంది. అంతేకాదు ఈ సినిమాను డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది. శర్వా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలోని ‘జిద్ధి జిద్ధి’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. ఇదొక మోటివేషన్ యాంథమ్. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను జిబ్రాన్ స్వరపర్చటమే కాక షెన్బగరాజ్, అరవింద్ శ్రీనివాస్, సుదర్శన్ రామ్‌లతో కలిపి ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్; డీవోపీ: జే యువరాజ్; ఎడిటర్: అనిల్‌కుమార్ పీ; ఆర్ట్: ఏ పనీర్ సెల్వం.