వంట కార్మికురాలిని తొలగించడం అన్యాయం
దమ్మపేట,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించకూడదని, కొత్తవారిని నియమించకూడదని కోరుతూ ఎం ఇ ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ... మండలంలోని నాయుడుపేట పాఠశాలలో కె.నాగమణి గత 12 సంవత్సరాల నుండి వంట నిర్వహిస్తున్నదని, నాగమణిని వంట చేయనీయకుండా కొంతమంది గ్రామస్తులు అడ్డుకొని బలవంతంగా విధుల నుండి తొలగించటం దుర్మార్గమన్నారు. ఈ విషయమై ఎంఈఓ జగపతికి తెలియపర్చినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు.
మధ్యాహ్న భోజన కార్మికురాలిని విధుల నుండి తొలగించాలంటే ఆ కార్మికురాలు వండిన వంట వికటించి విద్యార్థులకు ప్రమాదం జరిగిన సందర్భంలోనే సంబంధిత ఎంఈఓ తోకూడిన కమిటీ విచారణ జరిపి తొలగించాలి గాని, ఎవరో బెదిరిస్తేనో ఆ కార్మికురాలను తొలగించటం ఏ నిబంధన ప్రకారం తొలగించారో అధికారులు చెప్పాలని అన్నారు. విధుల నుండి తొలగించిన నాగమణిని పంట కార్మికురాలుగా విధుల్లోకి తీసుకోవాలని మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు , రామకృష్ణ, సత్యవతి, ఈశ్వరమ్మ, పార్వతి, వెంకటలక్ష్మి, భూదెమ్మ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






