3 August, 2026 | 1:14 AM

కొలిక్కి రాని రాజోలి నూతన కార్యాలయాల పంచాయతీ

03-08-2026 12:04 AM

*కొత్త రాజోలి  పాత రాజోలి... ఒకే గ్రామం, రెండు భిన్నాభిప్రాయాలు

* అధికారులు, రాజకీయ నాయకులను కలుస్తున్న అఖిలపక్ష కమిటీ..

* ప్రజాభిప్రాయ సేకరణతోనే శాశ్వత పరిష్కారమంటున్న గ్రామస్తులు

అలంపూర్, ఆగస్టు 2 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ప్రభుత్వ నూతన కార్యాలయాల ఏర్పాటు అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పునరావాస కేంద్రంగా ఏర్పాటైన కొత్త రాజోలిలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఒక వర్గం పట్టుబడుతుండగా, చారిత్రక ప్రాధాన్యం కలిగిన పాత రాజోలిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది. దీంతో ఒకే గ్రామంలో రెండు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పునరావాస కేంద్రానికే ప్రాధాన్యం

2009లో తుంగభద్ర వరదలతో పాత రాజోలి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రభుత్వం కొత్త రాజోలిలో పునరావాస కాలనీ ఏర్పాటు చేసి బాధితులకు ఇళ్లను నిర్మించింది. వరద ముప్పు లేకుండా ప్రజలు సురక్షితంగా జీవించేలా తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని, నూతన మండల కార్యాలయాలు కూడా కొత్త రాజోలిలోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులను కలిసి వినతిపత్రాలు అందజేస్తోంది.

పాత రాజోలికే మద్దతు

మరోవైపు చారిత్రక గుర్తింపు, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ కార్యాలయాలు పాత రాజోలిలోనే ఉండాలని మరో వర్గం గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

కొత్త రాజోలిలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే వరద ముప్పు ఉండదని, భవిష్యత్ తరాలకు భద్రతతో పాటు మండలంలోని 11 గ్రామాల ప్రజలకు సైతం సౌకర్యవంతంగా ఉంటుందని అఖిలపక్ష కమిటీ వాదిస్తోంది. దీనికి విరుద్ధంగా పాత రాజోలి వర్గం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.

ప్రజాభిప్రాయ సేకరణతోనే పరిష్కారం

రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలనే ప్రాతిపదికగా తీసుకుని గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అందరికీ అనువైన ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరద ముప్పు, ప్రజల రాకపోకలు, భవిష్యత్ అభివృద్ధి, అన్ని గ్రామాలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజోలి నూతన కార్యాలయాల అంశం ప్రస్తుతం స్థానికంగానే కాకుండా పరిసర గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.