2 April, 2026 | 2:22 AM

భార్యతో విభేదాలు.. వైద్యుడి ఆత్మహత్య

02-04-2026 12:32 AM

మేడ్చల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కీసర మండలం అహ్మద్గూడలోని శ్రీ లక్ష్మీ ఎన్క్లేవ్కు చెందిన భార్యాభర్తల మధ్య నెలకొన్న కుటుంబ విభేదాలు విషాదాంతానికి దారి తీశాయి. పి. వీణపాణి, ఆమె భర్త డా. జోసెఫ్ వినోద్ కుమార్ (40) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 31న వీణపాణి ఫిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

అదే రోజు సాయంత్రం 7:30 గంటల సమయంలో జోసెఫ్ వినోద్ కుమార్ తండ్రి పసల ఆరోగ్యమయ్య పోలీసులను ఆశ్రయించి, తన కుమారుడు భార్య చేత మానసిక వేధింపులకు గురై, మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాంపల్లి దయ్యారా ఔటర్ రింగ్ రోడ్ వద్ద కారులో గుర్తుతెలియని ఇంజెక్షన్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

మృతదేహానికి పోస్టుమార్టం పరీక్ష నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెండు కేసులను అనుసంధానించి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని, సాక్ష్యాధారాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి అంజనేయులు తెలిపారు.