లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కుల పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని 45 మంది లబ్ధిదారులకు 12 లక్షల 59 వేల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఐదు గ్యారెంటీలను అమలు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఓసీలలోని పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు.
రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి 22 లక్షలకుపైగా రైతు కుటుంబాలకు ఊరట కల్పించామని చెప్పారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, మొదటి దశలో 3,500 ఇళ్లు, రెండో దశలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, వేములవాడ నియోజకవర్గానికి కూడా అలాంటి పాఠశాల మంజూరై నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు గుర్తుచేశారు.
వైద్య రంగంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గతంతో పోలిస్తే రెండింతలకుపైగా ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఎల్‌ఓసీ ద్వారా పేదలకు నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు కొత్తగా ప్రారంభమవుతున్న టిమ్స్ ఆస్పత్రుల్లోనూ ఉచిత చికిత్స అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.రాష్ట్రంలో రోడ్లు, వంతెనలు, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని చెప్పారు. రాజన్న ఆలయంతో పాటు పలు దేవాలయాల అభివృద్ధికి భారీ నిధులు వెచ్చిస్తున్నామని, హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు.
వేములవాడ,చందుర్తి,కోరుట్ల రహదారి విస్తరణతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి భారీ నిధులు మంజూరయ్యాయని, చందుర్తి మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మండలానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకువచ్చి అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని విప్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొట్టే ప్రభాకర్, సర్పంచి పోలీస్ సత్యం, మాజీ జెడ్పిటిసి నాగం కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సహాయనిది చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు.






