21 July, 2026 | 12:12 PM

రాష్ట్రాలు ఇంకా ప్రయాణించాలి!

21-07-2026 01:31 AM
  1. పెట్టుబడి అనుకూలతల సూచీపై నీతి ఆయోగ్
  2. టాప్ 5 రాష్ట్రాల్లో గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు 
  3. జాబితాలో టాప్ 5లో కనపడని తెలంగాణ
  4. అవకాశాలు అన్నీ ఉన్నా.. ఉపయోగం లేని వైనం
  5. రాష్ట్ర సర్కారు దృష్టి సారించాల్సిందే

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): దేశంలో తొలిసారిగా రూపొందిం చిన పెట్టుబడి అనుకూలత సూచీలో నీతి ఆయోగ్ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎనిమిది ప్రధాన అంశాల ఆధారంగా 100 పాయింట్లకు ర్యాంకులు కేటాయించింది. అయితే ఏ ఒక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా 60 పాయింట్ల మార్కును చేరుకోలేదని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఈ సూచీ జాబితాలో 50 పాయింట్లను దాటిన రాష్ట్రాలు ఐదు ఉన్నప్పటికీ అభివృద్ధిలో, పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతుందని భావిస్తున్న తెలంగాణ లేకపోవడం గమనార్హం.

పెట్టుబడి అనుకూలత సూచీ (ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్)లో 50 పాయింట్లకు పైగా సాధించిన గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు టాప్ 5లో అగ్రగామిగా ఉన్నాయి. 45 నుంచి 50 పాయింట్ల మధ్య సాధించిన పదిహేను రాష్ట్రాలను ముందంజలో ఉన్న రాష్ట్రాలుగా, 40 కంటే తక్కువ పాయింట్లు సాధించిన ఎనిమిది రాష్ట్రాలను ఆకాంక్షిత రాష్ట్రాలుగా నీతి ఆయోగ్ పేర్కొంది.

దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ 100 పాయింట్లకుగాను 56.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, తమిళనాడు రెండూ 53.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఒడిశా 52.4 పాయింట్లతో తొలి నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకుంది. అలాగే 12 కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాలను పరిశీలిస్తే.. ఉత్తరాఖండ్ 47.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌లు ఉన్నాయి. ఏడు నగర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గోవా 53.1 పాయింట్లతో ఆధిపత్యం ప్రదర్శించగా, ఢిల్లీ, చండీగఢ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

వీటి ఆధారంగా పాయింట్లు 

నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసిన ఈ సూచీ ఎనిమిది ప్రధాన అంశాల ఆధారంగా ఇలా పాయింట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూల వాతావరణం, వనరులు, ప్రభుత్వ విధానం, నియంత్రణ సౌలభ్యం, ఆర్థిక ఆరోగ్యం, సంస్థాగత వాతావరణం, పర్యావరణ స్థిరత్వం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రతి అంశాన్ని విడివిడిగా అంచనా వేసి, పెద్ద రాష్ట్రాలు, కొండ ప్రాంత ఈశాన్య రాష్ట్రాలు, నగర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అనే మూడు విభాగాల్లో ఫలితాలను ప్రకటించారు.

ఏ ఒక్క రాష్ట్రం కూడా అన్ని అంశాల్లో ఆధిపత్యం ప్రదర్శించలేదు. ఒక్కో అంశంలో ఒక్కో రాష్ట్రం/నగరం ప్రభావాన్ని చూపాయి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అశోక్ లాహిరి సూచీ ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది పోటీ కాదు. ఇది ర్యాంకింగ్ ప్రక్రియ కూడా కాదు అని స్పష్టం చేశారు.

రాష్ట్రాలు ఏ రంగాల్లో మెరుగ్గా పనిచేస్తున్నాయి, ఎక్కడ ఇంకా సంస్కరణలు అవసరమో తెలియజేయడమే దీని ఉద్దేశమని ఆయన పేర్కొన్నా రు. పెట్టుబడులు రాష్ట్రాల్లోనే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుంది. కానీ చాలా పనులు రాష్ట్రాలే చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు అవస రమైన వేగాన్ని అందుకోవడంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మౌలిక సదుపాయాల్లో..

* 25 పాయింట్లకు గాను మౌలిక సదుపాయాల విభాగంలో చండీగఢ్ 15 పాయింట్లతో సూచీలోనే అత్యధిక స్కోరు సాధించింది. నగర రాష్ట్రాల విభాగంలో గోవా, ఢిల్లీ చెరో 14 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ 13.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు 13.6 పాయింట్లతో గుజరాత్‌కు అత్యంత సమీపంలో ఉంది. కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ 11.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

వ్యాపార అనుకూల వాతావరణం

* 20 పాయింట్లకు గాను వ్యాపార అనుకూల వాతావరణ విభాగంలో ఢిల్లీ 9.3 పాయింట్లతో నగర రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇది పెద్ద రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర స్కోరు 9.4 కంటే  స్వల్పంగా తక్కువ. దేశంలో అత్యధిక ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల వాటా, అతిపెద్ద ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభా నెట్‌వ ర్క్ ఆధారంగా ఈ స్కోరు లభించింది. కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం 7.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

వనరుల విభాగంలో గోవా టాప్

* 15 పాయింట్లకు గాను వనరుల విభాగంలో గోవా 8.3 పాయింట్లతో సూచీలో అగ్రస్థానంలో ఉంది. నైపుణ్యాభివృద్ధిపై అత్యధిక జీఎస్డీపీ వ్యయం, ఆరోగ్య సంరక్షణ రంగంపై అధిక వ్యయం ఇందుకు దోహదపడ్డాయి. పెద్ద రాష్ట్రాల్లో ఒడిశా 8.2, కొండ ప్రాంత రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ 7.2 పాయింట్లతో ముందంజలో నిలిచాయి.

ప్రభుత్వ విధానంలో పుదుచ్చేరి

* 10 పాయింట్లకు గాను ప్రభుత్వ విధాన విభాగంలో నగర రాష్ట్రాల్లో పుదుచ్చేరి 4.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్  5.4, కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాల్లో అ స్సాం 4.9 పాయింట్లతో ముందున్నాయి.

నియంత్రణ సౌలభ్యం

* మొత్తం 12 పాయింట్లకు గాను నియంత్రణ సౌలభ్యం విభాగంలో నగర రాష్ట్రాల్లో గోవా, కొండ ప్రాంత రాష్ట్రాల్లో మేఘాలయ చెరో 8.5 పాయింట్లతో సంయుక్తంగా జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ 8.4 పాయింట్లతో ముందంజలో ఉంది.

తెలంగాణ స్థానం

* ఎనిమిది విభాగాల్లో టాప్ 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాను చూసుకుంటే.. ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రం పేరు కనపడకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ప్రతిభాపాటవాలకు, వనరులకు, ప్రభుత్వం పాలసీలు, పెట్టుబడుల రాకకు అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ ఎందుకనో తెలంగాణ ఈ సూచీలో టాప్‌లో కనపడలేకపోవడం గమనార్హం. రెండో కేటగిరీ అయిన ‘ముందంజలో ఉన్న రాష్ట్రాలు’ (ఫంట్ రన్నర్) తెలంగాణ (47.3 పాయింట్లు) చోటు సంపాదించింది.

ఇందులో మొత్తం 15 రాష్ట్రాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల అంశంలో మొత్తం 17 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో నిలిచింది. ఈ అంశంలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌కు 13.7 పాయింట్లు రాగా.. తెలంగాణకు 10.5 పాయింట్లు వచ్చాయి.

వ్యాపార అనుకూల వాతావరణం అంశంలో మొత్తం 17 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 7.8 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాలసీల విభాగంలోనూ 6వ స్థానంలో నిలిచింది. వ్యవస్థాపరమైన వాతావరణం విభాగంలో చిట్టచివరణ నిలిచింది. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఈ సూచీలో తెలంగాణ టాప్ 5లో కనపడకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.