21 July, 2026 | 9:33 AM

ఎల్ నినో ప్రభావంపై అవగాహన సదస్సు

20-07-2026 08:57 PM

కొండపాక,(విజయక్రాంతి): కుకునూరుపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎండి. మహబూబ్ అలీ ఆధ్వర్యంలో కుకునూరుపల్లి రైతు వేదికలో మండల సర్పంచులు, గ్రామస్థాయి అధికారులతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు–ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గోవిందరాజులు మాట్లాడుతూ తక్కువ నీటితో సాగు చేయగల జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు, ఆముదం, అపరాలు వంటి పంటల సాగుకు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. ఉద్యానవన శాఖ అధికారి కౌసల్య కూరగాయలు, ఆయిల్‌పామ్ తోటల విస్తరణపై అవగాహన కల్పించారు.

మండల పంచాయతీ అధికారి నాగభూషణం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక, పారిశుద్యంపై వివరించగా, టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పథకం ద్వారా ఫార్మ్‌పాండ్లు, ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ఏఈ తిరుమల్ రెడ్డి తాగునీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. వైద్యాధికారి డా. అఖిల సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నియంత్రణ చర్యలపై సూచనలు ఇవ్వగా, మండల విద్యాశాఖ అధికారి బి. సత్తయ్య బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.