మృత్యు ఉచ్చుగా మారిన సీతారామ కెనాల్ బ్రిడ్జి
పైకి తేలిన ఇనుప రాడ్లు.. భారీ గోతులతో ప్రమాద ఘంటికలు
అంజనాపురం–జింకలగూడెం మార్గంలో వాహనదారుల ప్రాణాలతో చెలగాటం
చర్యలు తీసుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం–జింకలగూడెం జాతీయ రహదారిపై(Anjanapuram–Jinkalagudem National Highway) ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై కాంక్రీట్ పూర్తిగా దెబ్బతినడంతో ఇనుప రాడ్లు పైకి తేలి కనిపిస్తున్నాయి. రహదారిపై ఏర్పడిన భారీ గోతులు వాహనదారులకు నిత్యం ప్రమాద సంకేతాలు పంపుతున్నాయి.ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గోతులను తప్పించబోయి అదుపుతప్పి పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాలు బ్రిడ్జిపై ప్రయాణించే సమయంలో దెబ్బతిన్న భాగం మరింత కుంగిపోతుందేమోనన్న భయం వ్యక్తమవుతోంది.గ్రామస్థులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు మరమ్మతుల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నా సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం సంభవించేలోపే సీతారామ ప్రాజెక్టు, రోడ్లు–భవనాల శాఖ అధికారులు వెంటనే బ్రిడ్జిని పరిశీలించి దెబ్బతిన్న భాగాలను అత్యవసరంగా మరమ్మతు చేయాలని, అవసరమైతే తాత్కాలికంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






