దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్
కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ-రక్తదాన శిబిరం ప్రారంభం
ఘట్ కేసర్,(విజయక్రాంతి): దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని అవుషాపూర్ లో మాజీ ఎంపీపీ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన లేబర్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేసి వారి చేతుల మీదుగా వేలాది మంది కార్మికులకు లేబర్ కార్డులను పంపిణీ చేశారు.
అలాగే సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని వారి కష్టంతోనే అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. లేబర్ కార్డులు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీమా సౌకర్యాలు, విద్యా, వైద్య ప్రయోజనాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి అర్హత కలిగిన కార్మికుడు లేబర్ కార్డు పొందాలని, వారి హక్కులను కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
రక్తదానం అనేది మహాదానమని, మనం ఇచ్చే ఒక యూనిట్ రక్తం ముగ్గురు ప్రాణాలను కాపాడగలదన్నారు. సమాజంలో ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అండగా నిలవాలని, జన్మదినాలు, శుభకార్యాలు వంటి సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏనుగు సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






