4 August, 2026 | 1:48 AM

తుర్క కాషా ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్ల పంపిణీ

04-08-2026 12:00 AM

కొత్తకోటలో రాష్ట్ర స్థాయి పథకాన్ని ప్రారంభించిన 

మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

వనపర్తి, ఆగస్టు 3 (విజయక్రాంతి): తుర్క కాషా ముస్లిం కమ్యూనిటీ ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యాంత్రిక పనిముట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు రూ.54 లక్షల వ్యయంతో జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 202526 సంవత్సరానికి 2,000 మంది లబ్ధిదారులకు రూ.12 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ... తుర్క కాషా కమ్యూనిటీ సభ్యులు అత్యంత శ్రమతో కూడిన వృత్తిలో జీవనోపాధి పొందుతున్నారని, ప్రభుత్వం అందిస్తున్న యాంత్రిక పరికరాలు వారి ఉపాధికి తోడ్పడతాయని చెప్పారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, షాదీఖానాల నిర్మాణానికి కూడా సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం సంతోషం: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

తుర్క కాషా కమ్యూనిటీ కోసం ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం సంతోషకరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కమ్యూనిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.