విద్యార్థులకు సామాగ్రి పంపిణీ
బేల, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సొన్‌కాస్ లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బేల అగ్రి డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సోమ వారం పాఠశాల సామాగ్రి పంపిణీ చేశారు. విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిళ్లు, నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ మాట్లాడతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యార్థుల విద్యాభివృద్ధికి అగ్రి డీలర్స్ అసోసియేషన్ సహకారం ఉంటుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించినట్లు అయ్యిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అగ్రి డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






