05-02-2026 12:00:00 AM
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో నిర్వహించిన సోషల్ జస్టిస్ డే వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఎర్రుపాలెం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం ఎర్రుపాలెం మండలంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, విద్యార్ధినిలతో కలిసి కలెక్టర్ సామాజిక ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజంగా తెలంగాణలో నిర్మించే దిశగా ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వేను విజయవంతంగా నిర్వహించి, రిపోర్టును ఫిబ్రవరి 4, 2025న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిందని అన్నారు. కుల, మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. మధిర మార్కెట్ కమిటి చైర్మెన్ బండారు నరసింహారావు, తహసీల్దార్ మన్నే ఉష శారద, ఎంపీడీవో బి సురేందర్, గురుకుల కళాశాల ప్రిన్సిపల్ చావా జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ నాగ సత్యవతి, బి పరిమళ, స్టాఫ్ సెక్రటరీ డి ధనలక్ష్మి, ఎర్రిపాలెం గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్కే శాభాష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.